సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై తొలి ఓటమి ఎదురైంది. బౌలర్లు సత్తాచాటినా.. బ్యాట్స్‌మెన్ విఫలమవడం ఆతిథ్య జట్టు కొంపముంచింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 40 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులే చేసింది. పొలార్డ్ (46 నాటౌట్; 26 బంతుల్లో 2×4, 4×6) మెరుపులతో ముంబయి ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటి ముంబయిని కట్టడి చేశారు. అనంతరం సన్‌రైజర్స్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది.
137 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన హైదరాబాద్, సెంచరీలతో జోరుమీదున్న వార్నర్, బెయిర్‌స్టోల ముందు అదేమంత పెద్ద స్కోరులా అనిపించలేదు. ఐతే బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ముంబయి అద్భుతంగా బౌలింగ్ చేసింది. పదునైన పేస్.. నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. జోసెఫ్ నిప్పులు చెరిగే బంతులతో సన్‌రైజర్స్‌ను హడలెత్తించాడు. తొలుత బెయిర్‌స్టో (16; 10 బంతుల్లో 3×4)ను లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (2/21) వెనక్కి పంపాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న పేసర్ జోసెఫ్ తాను వేసిన మొదటి బంతికే వార్నర్ ఔట్ చేశాడు. బౌండరీ కోసం ప్రయత్నించిన వార్నర్.. బంతిని వికెట్ల మీదకి ఆడుకుని నిష్క్రమించాడు. 33 పరుగుల వద్దే సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత ఓవైపు జోసెఫ్.. మిగతా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. శంకర్ (5), పాండే (16), పఠాన్ (0), హుడా (20) ఒత్తిడికి చిత్తయ్యారు. 63 పరుగుల తేడాలో సన్‌రైజర్స్ 10 వికెట్లు కోల్పోయింది.
ముంబయి : 6 ఓవర్లలో 30/2. 10 ఓవర్లలో 52/3. 18 ఓవర్లలో 97/7. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ స్కోర్లివి. స్పిన్‌కు సహకరిస్తున్న వికెట్‌పై ముంబయి బ్యాటింగ్ చప్పగా సాగింది. సందీప్ ఓవర్లో సిక్సర్‌తో అలరించిన రోహిత్ (11).. నబి (1/13) బౌలింగ్‌లో హుడా చేతికి చిక్కాడు. అక్కడ్నుంచి 18 ఓవర్ల వరకు ముంబయి స్కోరు మందకొడిగా సాగింది. నబి, రషీద్‌ఖాన్ (1/27), కౌల్ (2/34), భువనేశ్వర్ (1/34), సందీప్‌శర్మ (1/20) సమష్టిగా సత్తాచాటడంతో బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా పరుగులు రాబట్టలేకపోయారు. సూర్యకుమార్ (7), డికాక్ (19), కృనాల్ (6), ఇషాన్ (17), హార్దిక్ (14) తక్కువ స్కోర్లకే నిష్క్రమించారు. 97 పరుగులకే ముంబయి 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఆ సమయంలో ముంబయి 120 పరుగులు చేయడం కూడా గగనమే అనిపించింది. అప్పటికి 9 పరుగులతో (13 బంతుల్లో) క్రీజులో ఉన్న పొలార్డ్.. చివరి 13 బంతుల్ని (నోబాల్ కలిపి) తానే ఎదుర్కొన్నాడు. కౌల్ వేసిన 19 ఓవర్లో 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. భువి చివరి ఓవర్లో ఒక సిక్సర్, 2 బౌండరీలతో 19 పరుగులు పిండుకున్నాడు. పొలార్డ్ పుణ్యమా అని చివరి 2 ఓవర్లలో ముంబయి 39 పరుగులు రాబట్టి పోరాడగలిగే స్కోరు సాధించుకుంది. పొలార్డ్ 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు రషీద్ అతడి క్యాచ్‌ను వదిలేయడం ముంబయికి లాభించింది.
నేటి మ్యాచ్ లు : బెంగుళూరు vs ఢిల్లీ సాయంత్రం 4గంటలకు; రాజస్థాన్ vs కలకత్తా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.