telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డీకే అరుణకు .. తెలంగాణ బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం..

dk-aruna

ఫైర్ బ్రాండ్ డీకే అరుణను తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు, చొరవ ఉన్న డీకే అరుణ అయితే బాగుంటుందని బీజేపీ హై కమాండ్ యోచిస్తోంది. అధ్యక్ష పదవీ కట్టబెట్టి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు డీకే అరుణకు బీజేపీ హైకమాండ్ సమాచారం అందజేసింది. దీంతో ఆమె హుటహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ బీజేపీ చీఫ్ అమిత్ షా, కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా అరుణకు అధ్యక్ష బాధ్యతకు సంబంధించి సమాచారం అందజేసే అవకాశాలు ఉన్నాయి. డీకే అరుణ నేతృత్వంలో పార్టీ ముందుకెళ్తుందని హై కమాండ్ భావిస్తోంది. అందుకే అధ్యక్ష పదవీకి డైనమిక్ లీడర్‌కి అప్పగిస్తోంది.

ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వెల్లగక్కిన మరునాడే డీకే అరుణ పేరు తెరపైకి రావడం విశేషం. తాజాగా ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ లేదంటే డీకే అరుణను నియమించాలని కోరారు. ఆ మరునాడే అరుణకు హైకమాండ్ నుంచి పిలుపురావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్య నేతలు ఉన్నా కానీ.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ లేదు. దీంతో ఆయా ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపలేకపోతుంది. ఈ అంశాన్ని బీజేపీ హైకమాండ్ కూడా పరిశీలించింది. డీకే అరుణ అయతే బాగుంటుందని.. అందరినీ కలుపుకొనిపోయి పార్టీని మంచి స్థానానికి తీసుకొస్తారని భావిస్తున్నారు. ఆమె హయాంలో బీజేపీ బలోపేతమై.. వచ్చే ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా అవతరించాలని కమలనాథుల వ్యుహం. ఇప్పటి రాష్ట్ర బీజేపీలో కూడా వర్గాలు ఉన్నాయి. ఎవరికీ వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో డీకే అరుణ అభ్యర్థిత్వాన్ని అంగీకరించే వారేవరు అన్నదే ప్రశ్నగా మారింది. వ్యతిరేకులు గ్రూపు రాజకీయాలు చేస్తే.. పరిస్థితి ఏంటీ అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ పార్టీ నేతలంతా కలుపుకొని పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

Related posts