మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సినిమా ఇండస్ట్రీ పెద్దల భేటీకి సంబంధించి.. ‘భూములు పంచుకుంటున్నారా అందరూ కూర్చొని’ అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించిన విషయం విదితమే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడారు. ‘‘నేనేం మాట్లాడలేదు. అతనే మాట్లాడుతున్నాడు. అస్సలు.. నేనేం మాట్లాడను ఛీఛీ. నేను మాట్లాడటమేంటి? ఏముంది మాట్లాడటానికి. ఇండస్ట్రీ అంతా ఇవాళ నాకు సపోర్ట్‌గా వస్తున్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి దాని గురించి’’ అని బాలకృష్ణ స్పందించారు. అయితే, ‘‘భూములు గురించి ఏదో మాట్లాడుకున్నారు అని మీరు అన్నారు. అదేం లేదంటారా?’’ అని యాంకర్ అడిగినప్పుడు.. ‘ఏమో.. ఉండొచ్చు’ అన్నట్టు హావభావాలు వ్యక్త పరిచారు బాలయ్య. ‘‘చిరంజీవి, నాగార్జున వెళ్లి కేసీఆర్ గారిని కలిశారు. దానికి కూడా మిమ్మల్ని పిలవలేదు. అంటే, మీరు గతంలో కేసీఆర్ గారి మీద విమర్శలు చేశారు. బహుశా, మిమ్మల్ని పిలవకపోవడానికి ఇదే కారణమంటారా?’’ అని యాంకర్ బాలకృష్ణను అడిగారు. దీనికి బాలయ్య సమాధానం ఇస్తూ.. ‘‘ఆ విషయం చెప్పొచ్చుగా నాకు. కేసీఆర్ గారికి ఆ విషయంలో నా మీద ఎప్పుడూ కోపం లేదు. అది రాజకీయమండి. మా నామా నాగేశ్వరరావుని వారి పార్టీలో జాయిన్ చేసుకోలేదా. ఆయన ఎన్ని తిట్లు తిట్టాడు. రాజకీయాలు వేరండి. అందుకే అంటోన్న హిప్పోక్రసీ, సైకో ఫాంటసీ. నన్ను వేరుగా చూస్తే మాత్రం తిక్కరేగుతుంది’’ అని అగ్రెసివ్‌గా మాట్లాడారు. ఇక కేసీఆర్ గారికి తనపై అలాంటి అభిప్రాయం ఏమీ లేదని బాలకృష్ణ అన్నారు. రామారావు గారి అభిమానిగా ఆయనకి తానంటే పుత్రవాత్సల్యం ఉందని బాలయ్య స్పష్టం చేశారు. మరి ఆయనతో సమావేశానికి తనను ఎందుకు పిలవలేదో తనకు తెలీదని అన్నారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు బాలయ్య.