telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అచ్యుతాపురం సెజ్ లో విషవాయువుల లీకేజీ..-మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఓ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజ్ పై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశించామన్నారు.

బుధవారం నాడు ఆయన విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసీ డెక్ లలో క్రిమిసంహరక మందులు కలపడం వల్లే తొలిసారి ప్రమాదం జరిగిందన్నారు. ఆ ప్రమాదంలో గ్లోరిఫై పాలీస్ అనే రసాయనం వెలువడినట్టుగా తెలిసిందని మంత్రి చెప్పారు. ఇప్పుడు ఏసీ డెక్ వల్ల జరిగిందా లేదా క్రిమి సంహారక మందుల వల్ల జరిగిందా అనేది నిర్ధారణ కావలసిన‌వసరం ఉందన్నారు.

ఈ ప్రమాదం యాధృచ్చికమా, ఉద్దేశపూర్వకమా అనేది తేలాల్సి ఉందన్నారు. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్ ముఖ్యమని,లేని పక్షంలో ఆయా కంపెనీలపై చర్యలు తీసుకొంటామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

అచ్యుతాపురం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తామని, గ్యాస్ లీకైన ప్రదేశంలో నమూనాలు లాబ్కు పంపుతున్నామని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.

అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లోని సీడ్స్‌ కర్మాగారంలో మంగళవారం నాడు రాత్రి విషవాయువులు లీకయ్యాయి. బి షిఫ్టులో ప‌నిచేస్తున్న ప‌లువురు మ‌హిళ‌లు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్‌, అందుబాటులో ఉన్న వాహనాల్లో ఆస్పత్రులకు పంపారు. ఈ సంఘటనలో 200 మంది వరకు అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లలో హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి సుమారు 100 మందికిపైగా బాధితులను అనకాపల్లికి తరలించారు. వీరిలో 56 మందిని ఎన్టీఆర్‌ ఏరియా ఆస్పత్రికి పంపారు. మరో 38 మందిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఎన్టీఆర్‌ ఆస్పత్రి వార్డులో పడకలు చాలకపోవడంతో కొంతమందిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు

Related posts