telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 5 వ స్థానానికి కోహ్లీ…

birthday wishes to virat kohli

ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 852 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్‌తో తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో విజృంభించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంకుకు ఎగబాకాడు. రూట్ 883 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విలియమ్సన్ ఖాతాలో ప్రస్తుతం 919 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ ఉన్నాడు. విలియమ్సన్‌, రూట్‌ మధ్య కేవలం 36 పాయింట్ల వ్యత్యాసం ఉంది. రెండో స్థానంలో ఉన్న స్మిత్‌.. రూట్‌ కన్నా 8 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. పాకిస్థాన్‌ సారథి బాబర్‌ అజామ్ ‌, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్ ‌స్టోక్స్ చెరో ర్యాంకు మెరగుపరచుకున్నారు. భారత టెస్టు స్పెషలిస్ట్‌ చెతేశ్వర్‌ పుజారా ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకుకు పడిపోయాడు. పుజారా ఖాతాలో ప్రస్తుతం 754 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. చెన్నై టెస్టులో భారత యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ మినహా భారత బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. అందుకే టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కిందకు పడిపోయారు. టాప్-10లో ఉండే అజింక్య రహానేకు ఈసారి చోటే దక్కలేదు.

Related posts