telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ పర్యటన పొడిగింపు నేపథ్యంలో .. సీమ పర్యటన వాయిదా..

jagan

సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా హస్తినలో పర్యటిస్తున్నారు. రెండో రోజూ కూడా బిజీబిజీగా గడిపారు. దీనితో ఢిల్లీ పర్యటన పొడిగించాల్సి రావటంతో.. రాయలసీమలో జగన్‌ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 08వ తేదీ గురువారం కడప, అనంతపురం జిల్లాల్లో సీఎం పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెనుకొండలో కియా కార్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా సీఎం జగన్‌ టూర్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన జగన్‌ బృందం సుమారు 40 నిమిషాల పాటు ఆమెతో చర్చలు జరిపింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక ఆర్థికసాయం అందించాలని కోరింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న 5 వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను జగన్‌ కోరారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న నవరత్నాల పథకాలకు ఆర్థికసాయం అందించాలని జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ టూర్‌లో భాగంగా… కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కూడా జగన్ కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులపై చర్చించారు. దాదాపు గంటసేపు వీరిద్దరి సమావేశం కొనసాగింది. సమావేశానంతరం మంత్రి గడ్కరీ ద్వారం బయటకు వచ్చి జగన్‌కు వీడ్కోలు పలికారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని సైతం జగన్‌ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

Related posts