telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ

ఒంట‌రి పోరాట‌మే బాబుకు లాభించ‌నుందా…?

Chandrababu-Naidu

ప్ర‌జాస్వామ్యంలో ఐదేళ్ల‌కోసారి ఎన్నిక‌లు రావ‌డం, ఆ ఎన్నిక‌ల‌ను అధికార‌, ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ప్ర‌తిష్టాత్మంగా తీసుకుని పోరాడ‌డం స‌హ‌జం. ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆయా పార్టీల నేత‌లు ప్ర‌త్య‌ర్ధుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డ‌మూ స‌హ‌జ‌మే. స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ఇప్ప‌టిదాకా సాగిన అన్ని సార్వ‌త్రిక, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేత‌ల విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో ఓటింగ్ నాటికి రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిపోయి ప్ర‌జల్లో ఓ విధ‌మైన ఉత్కంఠ నెల‌కొని ఉంటుంది. ప్ర‌స్తుతం దేశం ఆ స్థితిలోనే ఉంది. ఎన్నిక‌ల వేడి దేశాన్ని ఉపేస్తోంది.

After 11 Parishat Elections Telangana

నేత‌ల ఆరోప‌ణ‌ల్లో వాస్త‌విక‌త లేక‌పోవ‌డం, అల‌వి కాని హామీలు ఇవ్వ‌డం, ఓట‌ర్లను త‌మ వైపుకు తిప్పుకునేందుకు బ‌రిలోనిలిచిన పార్టీలు, నేత‌లంద‌రూ స‌క‌ల‌శ‌క్తులూ ఒడ్డ‌డం వంటి ఎన్నిక‌ల దృశ్యాలు ఈసారి మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లోనూ,జాతీయ‌స్థాయిలోనూ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు భావ‌సారూప్య పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల్లో అదృష్టం ప‌రీక్షించుకుంటున్నాయి. ఎవ‌రు, ఎవ‌రికి మద్ద‌తిస్తారు అనేది ఆయా నేత‌ల రాజ‌కీయ విధానంపై ఆధార‌ప‌డి సాగుతోంది. నిజానికి త‌మ సిద్ధాంతాలు, రాజ‌కీయల‌క్ష్యాల‌ను బ‌ట్టి పొత్తులు కుదుర్చుకునే హ‌క్కు ప్ర‌జాస్వామ్యంలో అన్ని పార్టీల‌కూ ఉంది. అయితే వివిధ రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తు నైతిక‌మా, అనైతిక‌మా అన్న‌ది ఆయా పార్టీల సిద్దాంతాలు, నేప‌థ్యాన్ని బ‌ట్టి ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుని తీర్పులు ఇస్తుంటారు.

election notifivation by 12th said ec

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఇదే జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన పార్టీల‌, నేత‌ల భ‌విత‌వ్యాన్ని అతిత్వ‌ర‌లోనే ఓట‌రు తేల్చనున్నాడు. అయితే గ‌తంలో జ‌రిగిన అనేక ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ అసెంబ్లీ ఎన్నిక‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఎన్నో విధాలుగా అత్యంత ప్ర‌త్యేక‌మ‌యిన‌వి. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ ఎన్నిక‌లు రాజ‌కీయ నేత‌ల భ‌విత‌వ్యాన్నే కాదు…న‌వ్యాంధ్ర ప్ర‌జల భావిజీవితాన్నీ నిర్దేశించ‌నున్నాయి. విభ‌జ‌న బాధిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ గాడిన ప‌డాలంటే వ‌చ్చే ఐదేళ్లూ అత్యంత కీల‌క‌మ‌యిన‌వి. రాష్ట్ర విభ‌జ‌న‌తో అన్నీ కోల్పోయిన స్థితి నుంచి ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన నవ్యాంధ్ర ఇప్పుడు కీల‌క‌మైన సంధి ద‌శ‌లో ఉంది. రాజ‌కీయంగా ఇప్పుడున్న ప‌రిస్థితులు కొన‌సాగితేనే న‌వ్యాంధ్ర ముందుకు సాగ‌గ‌ల‌దు. అమ‌రావ‌తి నిర్మాణం పూర్తికావాల‌న్నా, చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు స్థిర‌ప‌డాల‌న్నా, సంక్షేమ ప‌థ‌కాల‌తో మెరుగుప‌డుతున్న సామాన్య ప్ర‌జాజీవితం ఆటంకాలు లేకుండా సాగిపోవాల‌న్నా….ఇవే రాజ‌కీయ‌ప‌రిస్థితులు రాష్ట్రానికి అవ‌స‌రం.

MLC Elections in AP 5 unanimous

స‌రిగ్గా చెప్పాలంటే ఎలాంటి కుదుపుల‌కు లోన‌వ‌కుండా, ఒడిదుడుకులు లేకుండా ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న ప్ర‌శాంతజీవ‌నం రాష్ట్రాన్ని పురోగ‌మ‌నంలో ఉంచుతుంది. కానీ కొంద‌రు నాయ‌కులు త‌మ‌కు తాము నిర్దేశించుకున్న రాజ‌కీయల‌క్ష్యాల దృష్ట్యా య‌థాత‌థ ప‌రిస్థితి కొన‌సాగ‌డం వారికి ఏ మాత్రం ఆమోద‌యోగ్యం కాదు. ఇది స‌హ‌జ ప‌రిణామ‌మే. అధికారంలోకి రావాల‌నుకునే పార్టీ రాజ‌కీయ మార్పు కోరుకుంటుంది. ఆ కోవ‌లోనే రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలూ చేస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అంతిమ ల‌క్ష్యం రాష్ట్ర ముఖ్య‌మంత్రి కావ‌డ‌మే కాబ‌ట్టి ఆయ‌న ఏపీలో ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల‌న్నింటినీ మార్చివేయాల‌ని కోరుకుంటున్నారు. అయితే ఇలా కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు కానీ ఇందుకు ఆయ‌న అనురిస్తున్న ప‌ద్ధ‌తుల్లోనే లోపం ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆవిర్భ‌వించినప్ప‌టికీ వైఎస్సార్ కాంగ్రెస్ త‌న బ‌లం ఎక్కువ‌గా ఉండే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నే కార్య‌క్షేత్రంగా ఎంచుకుంది. తెలంగాణ‌లో ఆ పార్టీ ఎన్నిక‌ల్లోనే పోటీచేయ‌డం లేదు. ఏపీ రాజ‌కీయాలే వైఎస్ జ‌గ‌న్ లక్ష్యం. కానీ ఆచ‌ర‌ణ‌లోకొచ్చేస‌రికి ఆయ‌న తెలంగాణ మీదే పూర్తిగా ఆధార‌ప‌డుతున్నారు. త‌న రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌న్నీ హైద‌రాబాద్ లోనే చ‌క్క‌దిద్దుకుంటున్నారు. అంతేకాకుండా ఓ అడుగు ముందుకేసి ముఖ్య‌మంత్రి కావాల‌న్న త‌న జీవిత‌ ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకునేందుకు తెలంగాణ అధినేత‌తో చేతులు క‌లిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ఒప్పుకుంటున్నారు.

jagan and chandrababu nominations today

ప్ర‌త్యేక హోదా కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో స్నేహం చేస్తున్నాన‌ని జ‌గ‌న్ పైకి చెప్పుకుంటున్న‌ప్ప‌టికీ ఆయ‌న ఏ ఉద్దేశంతో ఈ ప‌నిచేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు అర్ధం కాకుండా లేదు. ఏపీ ఎన్నిక‌ల్లో ఈ సారి ప్ర‌జ‌లంతా అత్యంత జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్న అంశం ఇదే. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత‌గా వైఎస్ జ‌గ‌న్ ఏపీలో తాడో పేడో తేల్చుకోవాలి. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపుకు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నించి, వారి అభిమానం పొంద‌గ‌లగాలి. అలాకాక ఏపీతో ఏమాత్రం సంబంధం లేని, అంతే కాకుండా…ఓ ర‌కంగా రాష్ట్రాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించే తెలంగాణ ముఖ్య‌మంత్రితో జ‌గ‌న్ పొత్తు ఏ మాత్రం స‌మ‌ర్ధ‌ర‌నీయం కాదు. జ‌గ‌న్ ఎన్ని విధాలుగా త‌న వైఖ‌రిని స‌మ‌ర్ధించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లోకి ఇది త‌ప్పుడు సంకేతాలు పంపించిన‌ద‌న‌డంలో సందేహంలేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌గా, తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ కు ఏపీ రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధం ఉండ‌కూడ‌దు. కానీ ప్ర‌స్తుత‌ప‌రిస్థితి అలా లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నార‌న్న ఏకైక కార‌ణంతో కేసీఆర్ ఆంధ్ర రాజ‌కీయాల్లో త‌ల‌దూరుస్తున్నారు. ఏపీలో కేసీఆర్ ప‌రోక్షంగానైనా వేలుపెట్ట‌డాన్ని ప్ర‌జ‌లు ఏ ర‌కంగానూ హ‌ర్షించ‌బోరు.

YS Jagan Write letter to KCR

తెలుగుదేశం నేప‌థ్యం దృష్ట్యా ఆ పార్టీ తెలంగాణ‌లో పోటీచేయ‌డం, చంద్ర‌బాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డం ఏ విధంగా చూసినా త‌ప్పుకాదు. కానీ కేసీఆర్ ప‌రిస్థితి దీనికి భిన్నం. టీఆర్ ఎస్ ను జాతీయ పార్టీగా ప్ర‌క‌టించినా కూడా ఆ పార్టీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థానం ఉండ‌దు. విభ‌జ‌న‌తో స‌ర్వ‌స్వం కోల్పోయిన ఏపీ ప్ర‌జ‌లు ఆ ప‌రిస్థితికి కార‌ణ‌మ‌యిన టీఆర్ ఎస్ ను, కేసీఆర్ ను శ‌త్రువుగానే చూస్తారు గానీ ఎలాంటి ప‌రిస్థితుల్లో మిత్రుడిగా భావించ‌రు. కాబ‌ట్టి టీఆర్ ఎస్ తో జ‌గ‌న్ జ‌త‌క‌ట్ట‌డం వ‌ల్ల ఆయ‌న‌కు లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ జ‌ర‌గ‌నుంది. అలాగే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఓడించ‌డానికి జ‌గ‌న్ చేస్తున్న మ‌రో ప్ర‌య‌త్నం బీజేపీతో ర‌హ‌స్య‌మైత్రి. కేసీఆర్ తో చేస్తున్న స్నేహాన్ని బ‌హిరంగంగా ఒప్పుకుంటున్న జ‌గ‌న్ బీజేపీతో బంధాన్ని బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం ఆపార్టీని ఏపీ ప్ర‌జ‌లు త‌మ‌కు న‌మ్మ‌క ద్రోహం చేసిన పార్టీగా చూస్తుండ‌డ‌మే. విభ‌జ‌న వేళ ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌హా అనేక హామీలు న‌మ్మ‌శ‌క్యంగా వినిపించిన బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం రాష్ట్రంపై అంతులేని నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించింది. నాలుగేళ్లు ఓపిక ప‌ట్టిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చివ‌రి ఏడాదిమాత్రం త‌న స‌హనాన్ని విడిచిపెట్టి బీజేపీ, ప్ర‌ధాన‌మంత్రి మోడీ చేసిన న‌మ్మ‌క‌ద్రోహాన్ని ప్ర‌జ‌ల ముందు ఎండ‌గ‌ట్టారు.

Chandrababu comments Jagan cases

ఎదురులేని అధికారంతో సాగిపోతున్న మోడీకి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌మ‌ని డిమాండ్ చేయ‌డం, అందుకోసం జాతీయ‌స్థాయిలో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం త‌ప్పుగా క‌నిపించింది. త‌మ హ‌క్కుల కోసం ఎదురొడ్డి నిలిచే ముఖ్య‌మంత్రి ఓ రాష్ట్రంలో ఉండ‌డం మోడీకి ఏ మాత్రం స‌మ్మ‌తం కాదు. అందుకే జాతీయ‌స్థాయిలో త‌న గెలుపుతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు ఓట‌మిని ఆయ‌న త‌న ల‌క్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ఇందుకోసం కేసీఆర్ స‌హాయ‌మూ తీసుకుంటున్నారు. కేసుల మాటున మారు మాట్లాడ‌కుండా ఉండే జ‌గ‌న్ ను ఏపీలో అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌ధాని హోదాలో అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలూ అందిస్తున్నారు. అంతిమంగా జ‌గ‌న్, కేసీఆర్, మోడీ క‌లిసి చంద్ర‌బాబును గ‌ద్దె దింపేందుకు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల నినాదాలు, త‌న హామీల‌ను న‌మ్ముకోకుండా రాష్ట్రానికి తీర‌ని ద్రోహంచేసిన కేసీఆర్, మోడీల‌తో చేతులు క‌ల‌ప‌డం ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు పంపిస్తోంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌జ‌లు ఈ ర‌హస్య‌పొత్తుల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఇదే ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌త్యేకం. పార్టీల, నేత‌ల వైఖ‌రిపై ప్ర‌జ‌ల అభిప్రాయం ఎన్నిక‌ల దాకా ఆగేప‌నిలేకుండానే తెలిసిపోతోంది.

chandrababu on modi tour in ap

నిజానికిదో కొత్త ప‌రిణామం. నిన్న‌మొన్న‌టిదాకా కూడా అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్, టీడీపీ పొత్తును ప్ర‌జ‌లు హ‌ర్షిస్తున్నారా లేదా అన్న‌ది కౌంటింగ్ దాకా తేల‌లేదు. ఓట్ల‌లెక్కింపు రోజే టీడీపీ, కాంగ్రెస్ స్నేహాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు ఒప్పుకోని విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అంత‌దాకా ఎవ‌రూ ప్ర‌జ‌ల నాడిని ప‌సిక‌ట్ట‌లేక‌పోయారు. కానీ ఏపీకి వ‌చ్చేస‌రికి ప‌రిస్థితిదీనికి భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని ప్ర‌త్యేక ప‌రిస్థితులు దృష్ట్యా ప్ర‌జాభిప్రాయం జ‌గ‌న్ కేసీఆర్ మోడీ కూటమిని వ్య‌తిరేకిస్తున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే ఎన్నిక‌ల‌కు ఎక్కువ స‌మ‌యం లేదు కాబ‌ట్టి ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించినా వైసీసీ ఏమీచేయ‌లేని స్థితి.

YS Jagan Files Nomination Pulivendul
ఇక ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే….చంద్ర‌బాబు వ‌య‌సు దృష్ట్యా ఈ అసెంబ్లీ ఎన్నిక‌లు ఆయ‌న‌ రాజ‌కీయ జీవితంలోనే అత్యంత కీల‌క‌మ‌యిన‌వి. దేశంలోని సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత‌ల్లో ఒక‌రిగా ఆయ‌న ఎన్నో ఎన్నిక‌లు చూసిన‌ప్ప‌టికీ….ఈ ఎన్నిక‌లు టీడీపీ భ‌విష్య‌త్ ను , చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని నిర్దేశించ‌నున్నాయి. ప‌నిచేసేవిధానంలో అత్యంత ఉత్సాహవంతుడైన యువ‌కుడిగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ 68 ఏళ్ల చంద్ర‌బాబు వృద్ధాప్యానికి చేరువ‌లో ఉన్నారని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు మ‌రోమారు అధికారం ల‌భిస్తేనే ఇప్ప‌టికే ప్రారంభ‌మైన అమ‌రావ‌తి నిర్మాణాన్ని నిరాటంకంగా ఆయ‌న కొన‌సాగించ‌గ‌ల‌రు. అలాకాక ఈ సారి అధికారం దూర‌మైతే ఇక ఆయ‌న రాష్ట్రానికి చేయ‌గ‌లిగేది ఏమీ ఉండ‌దు. ఐదేళ్ల త‌ర్వాత ఆయ‌న వ‌య‌సు 74కు చేరుతుంది. ఆ వ‌య‌సులో ఆయ‌న రాష్ట్రాన్ని తిరిగిగాడిలో పెట్ట‌డం చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం. ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోతే చంద్రబాబు రాజ‌కీయ జీవితం మునుప‌టిలా ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం ఇంత‌టితో ముగిసిపోనుంది అని ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారు.

KTR Meets YS Jagan at Lotas pond

అలాజ‌ర‌గ‌కుంగా ఉండాలంటే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు గెలుపు త‌ప్ప‌నిస‌రి. కానీ అంద‌రూ క‌లిసి చంద్ర‌బాబును ఒంట‌రిని చేస్తున్నారు. త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం జ‌గ‌న్ కు స‌హ‌క‌రిస్తున్న మోడీ, కేసీఆర్ లే కాదు…. రాష్ట్రంలోని అనేక‌మంది టీడీపీ ఓట‌మికోసం స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. నిజానికి ఐదేళ్ల కాలంలో విభ‌జ‌న బాధిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను చంద్ర‌బాబు తీర్చిదిద్దిన విధానం విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకుంది. ముఖ్య‌మంత్రి చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ది కార్య‌క్ర‌మాలు, న‌వ్యాంధ్రకు దిశానిర్దేశం చేసిన విధానం, అమ‌రావ‌తి నిర్మాణంవంటి అంశాలు గ‌మ‌నిస్తే రాష్ట్రంయావ‌త్తూ ఆయ‌న వెంట న‌డ‌వాలి. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. రాజ‌కీయ నాయ‌కుల సంగ‌తిప‌క్క‌న పెడితే స్వీయ‌ప్ర‌యోజ‌నాల లెక్క‌ల్లో మునిగితేలుతున్న ఇత‌ర రంగాల ప్ర‌ముఖులు అనేక‌మంది చంద్రబాబుకు వ్య‌తిరేకంగా జ‌ట్టుక‌ట్టారు. సినిమా సెల‌బ్రిటీల నుంచి రాజ‌కీయాల‌కు ఏ మాత్రం సంబంధం లేని హిందూ మ‌త‌గురువుల దాకా ఇదే తంతు. కేసీఆర్ భ‌యంతో సినీప్ర‌ముఖులంతా ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. ఇక మ‌త‌గురువుల సంగ‌త‌యితే మ‌రింత విడ్డూరం. జ‌గ‌న్ జ‌న్మ‌తః క్రిస్టియ‌న్. ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ నిరంత‌రం చేతిలో బైబిల్ ప‌ట్టుకుని తిరుగుతుంటారు. జగ‌న్ స‌మీప బంధువులు క్రైస్త‌వ ప్ర‌చార‌కులుగానూ ఉన్నారు. మ‌రి అలాంటి జ‌గ‌న్ తో చిన‌జీయ‌ర్ స్వామి, స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి వంటి మ‌త గురువులు భేటీ అవ‌డం, ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ట్టుగా ఫొటోల‌కు ఫోజులివ్వ‌డాన్ని ప్ర‌జ‌లెలా అర్దం చేసుకోవాలి?

Chandrababu fire sakshi media

కేంద్ర‌లో మోడీ ద‌గ్గ‌ర‌నుంచి రాష్ట్రంలో చిన‌జీయ‌ర్ స్వామి దాకా అంద‌రూ క‌లిసి చంద్ర‌బాబును ఒంట‌రిని చేయ‌డానికి కార‌ణ‌మేమిటి? త‌న రాజ‌కీయ అనుభ‌వాన్నంతా న‌వ్యాంధ్ర అభివృద్ధికి ఉప‌యోగిస్తుండ‌డం ద్వారా తిరుగులేనినేత‌గా చంద్ర‌బాబు గుర్తింపుపొంద‌డాన్ని త‌ట్టుకోలేకా…చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే స్వ‌ప్ర‌యోజ‌నాలు నెర‌వేర‌వ‌నా…?
విభ‌జ‌న బాధిత రాష్ట్రం ఫీనిక్స్ ప‌క్షిలా పైకి లేవ‌డంవారికి ఇష్టం లేదా….ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు క‌లుగుతున్న సందేహాలివే. అన్ని ఎన్నిక‌ల్లా పార్టీల నినాదాలు, హామీలు కాకుండా, చంద్ర‌బాబు అనుకూల‌త లేదా వ్య‌తిరేక‌త ఏపీ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌నుంది. రాష్ట్రాభివృద్ధి కోసం స‌ర్వశక్తులూ ఒడ్డుతున్న ముఖ్య‌మంత్రి ఓ వైపు ఉంటే త‌మ రాజ‌కీయ‌ ప్ర‌యోజ‌నాల కోసం ర‌హ‌స్య‌ కూట‌మి క‌ట్టి చంద్ర‌బాబు ఓట‌మినే ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న నేత‌లు మ‌రోవైపు. మ‌రి త‌న‌ రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని, రాష్ట్ర భ‌విష్య‌త్ ను నిర్దేశించుకునేందుకు చంద్ర‌బాబు చేస్తున్న ఒంట‌రి పోరాటం ఎలాంటి ఫ‌లితాల‌నిస్తుందో వేచిచూడాలి.

కమలా దేవి

Related posts