telugu navyamedia
క్రీడలు వార్తలు

పాయింట్ల పట్టికలో మళ్ళీ పైకి వెళ్లిన భారత్…

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ దుమ్మురేపింది. ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో 317 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకున్న కోహ్లీసేన డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఫస్ట్ టెస్ట్‌లో గెలిచి ఇంగ్లండ్ టాప్‌లోకి వెళ్లగా.. తాజా పరాజయంతో మళ్లీ నాలుగోస్తానికి పడిపోయింది. దాంతో ఫైన‌ల్ బెర్త్ రేసు ఆస‌క్తిక‌రంగా మారుతోంది. ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోవ‌డంతో ఇప్ప‌టికే న్యూజిలాండ్ ఫైన‌ల్ చేరిన విష‌యం తెలిసిందే. మ‌రో బెర్త్ కోసం భారత్, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొంది. ఈ సిరీస్‌ను టీమిండియా 3-1 లేదా 2-1తో గెలిచినా ఫైన‌ల్‌కు వెళ్తుంది. అదే ఇంగ్లండ్ ఫైన‌ల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు క‌చ్చితంగా గెల‌వాల్సి ఉంటుంది. ఒక‌వేళ సిరీస్ డ్రా అయితే ఈ రెండు టీమ్స్ కాకుండా ఆస్ట్రేలియా ఫైన‌ల్‌కు వెళ్తుంది. ఈ సమీకరణాలతో ఐసీసీ తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్టిన వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ రేసు చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. ఫస్ట్ టెస్ట్‌కు ముందు టాప్‌లో ఉన్న కోహ్లీ సేన.. 227 పరుగుల భారీ పరాజయంతో ఒక్క సారిగా నాలుగో స్థానానికి పడిపోయింది. దాంతో భారత్‌కు ఫైనల్ బెర్త్ దక్కుతుందా? లేదా అనే సందేహం వ్యక్తమైంది. కానీ నేలకు కొట్టిన బంతిలా టీమిండియా విజృంభించడంతో ఇంగ్లండ్ చిత్తయింది. ఈ గెలుపుతో భారత్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలను సజీవం చేసుకుంది. వాస్తవానికి పాయింట్స్ ప్రకారం భారత్ టాప్‌లో ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో చాలా సిరీస్‌లు రద్దవ్వడంతో ఐసీసీ విన్నింగ్ పర్సంటేజ్ రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్ 69.7 పర్సంటేజ్ తో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 70.0 పర్సంటేజ్ తో అగ్రస్థానంలో ఉంది.

Related posts