telugu navyamedia
క్రీడలు వార్తలు

అరుదైన ఘనత సాధించిన అక్షర్‌ పటేల్‌…

టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. చెన్నై చెపాక్‌ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పనిపెట్టాడు. స్పిన్‌కు అనుకూలించిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. 21 ఓవ‌ర్లు వేసిన అక్ష‌ర్.. 60 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో అక్ష‌ర్ మొత్తం ఏడు వికెట్లు తీసుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న అక్ష‌ర్.. మొద‌టి ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు వేసి రెండు వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్ 5 వికెట్లు తీయడంతో అరంగేట్రంలోనే 5 వికెట్లు ఫీట్‌ అందుకున్న తొమ్మిదో ఆటగాడిగా.. ఆరవ టీమిండియా స్పిన్నర్‌‌గా చరిత్ర సృష్టించాడు. ఇక దిలీప్‌ దోషి తర్వాత రెండో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా డెబ్యూలోనే 5 వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు భారత్ నుంచి అరంగేట్రం టెస్టులో 5 వికెట్ల ఫీట్‌ అందుకున్న స్పిన్నర్లలో వివి కుమార్, దిలీప్‌ దోషి, నరేంద్ర హిర్వాణి, అమిత్‌ మిశ్రా, రవిచంద్రన్‌ అశ్విన్ లు ఉన్నారు. మ్యాచ్‌ అనంతరం అక్షర్‌పటేల్‌ మాట్లాడుతూ… ‘డెబ్యూ టెస్టులోనే ఐదు వికెట్లు తీయడం ఆనందం కలిగించింది. ఈ ఫీట్‌ సాధించడం నాకు చాలా స్పెషల్‌. చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో మా పని చాలా సులువైంది.ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేయడంలో ముగ్గురు స్పిన్నర్లే వికెట్లు తీయడం అరుదుగా జరుగుతుంటుంది. నా స్పీడ్‌ను కంట్రోల్‌ చేసుకుంటూ బంతిని పదును పెడుతూ వికెట్లను తీశాను. అశ్విన్‌తో పాటు కుల్దీప్‌ యాదవ్ కూడా బౌలింగ్‌ టెక్నిక్‌లో సలహాలు ఇవ్వడం మరింత కలిసివచ్చింది. మొదటి టెస్టులో ఓటమి పాలయిన వేదికలోనే రెండో టెస్టులో గెలిచి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని అన్నాడు.

Related posts