కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉన్న అనేక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం టెక్నాలజీ రంగంపై బాగానే పడింది. చైనా కేంద్రంగా అనేక ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్లను కలిగి ఉన్న ఆపిల్ కూడా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఐఫోన్ల ఉత్పత్తి కూడా తగ్గనుందని ప్రముఖ ఆపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో వెల్లడించారు.
ఆపిల్ కంపెనీ తన నూతన ఐఫోన్.. ఐఫోన్ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్ 9ను మార్చిలో విడుదల చేస్తుందన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఫోన్లను ఆపిల్ ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ఆ ఫోన్ల ఉత్పత్తి చాలా వరకు తగ్గుతుందని మింగ్ చి కువో అంచనా వేస్తున్నారు.