telugu navyamedia
రాజకీయ

తెలుగు రాష్ట్రాల‌పై గులాబ్‌ ఎఫెక్ట్‌..

గులాబ్ తుపాను పంజా విసురుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడ‌తెరిపిలేని వ‌ర్షాలు కురుస్తున్నాయి. గాలి, ఉరుములు మెరుపులతో కూడిన వాన నగర ప్రజలను భయపెడుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య ఆదివారం రాత్రి గులాబ్ తుఫాను తీరం దాటింది.

గులాబ్‌ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

Heavy rainfall predicted in Telangana, IMD issues red alert for state, orange alert for Hyderabad. Check details

అలాగే..ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాలు అతి భారీ వర్షాలకు అతలాకులతం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.   తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ ‌తుఫాను.. రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటింది. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయింది. మరో 6 గంటల్లో మరింత బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అటు శ్రీకాకులం, విజయనగరం జిల్లాలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

మరో వైపు తుపాను ప్రభావంతో విశాఖలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.  ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

Related posts