నేటి తరానికి సెల్‌ఫోన్ ద్వారా ఎన్నో కంటి సమస్యలు వస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం నాగులబండ వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ జీఎన్ రావు, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి, పేదలకు సేవలు చేసినప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందన్నారు.
నాగులబండలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కార్పొరేట్ స్థాయి కంటివైద్యం ఇక్కడ లభిస్తుందని చెప్పారు. ప్రతి 50 వేల మందికి ఒక సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సిద్దిపేటలో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని పార్థసారథిని హరీశ్ రావు కోరారు.