* సమతామూర్తి రాబోయే తరాలు వారికి స్పూర్తి..
* దివ్యక్షేత్రాలను దర్శించుకున్న అమిత్ షా..
* సనాతన ధర్మం అన్నింటికీ మూలం..
* రామానుజా చార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో అమిత్ షా..
కేంద్ర హోంశాఖ మంత్రి ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు.కులం, మతం, జాతి బేధం లేకుండా సమతామూర్తిని దర్శించుకోవాలని సూచించారు. దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతాకేంద్రం ఖ్యాతి గడిస్తుందని అన్నారు.
2003లోనే చినజీయర్ స్వామితో పరిచయం ఏర్పడింది. గుజరాత్ భూకంప బాధితులకు చినజీయర్ స్వామి సాయం చేశారు. చినజీయర్ స్వామి ఓ గ్రామాన్ని పునర్నిర్మించారు. చినజీయర్ స్వామి చిన్న వాళ్లనైనా ఎంతో గౌరవిస్తారు. చినజీయర్ స్వామి మర్యాద చూస్తే మనసు ఉప్పొంగింతోందని ప్రశంసించారు.
చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్‌లో ఏడో రోజు సహస్రాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది.. శ్రీరామనగరంలో రథ సప్తమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు యాగశాలలో దుష్టగ్రహ బాధానివారణకై శ్రీనారసింహ ఇష్టి, జ్ఞాన జ్ఞానాకృత సర్వవిధ పాపనివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువులో భాగంగా పెరుమాళ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద పారాయణం జరిగింది. ఆదిత్య హృదయ సామూహిక పారాయణం చేశారు. అనంతరం శ్రీనారాసింహ అష్టోత్తర శతనామావళి పూజను అహోబిలం రామానుజజీయర్ స్వామీజీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో అమిత్ షా ఈ సహస్రాబ్ది వేడుకల్లో తిరునామం, పంచెకట్టుతో వేడుకల్లో పాల్గొన్నారు. ముచ్చింతల్‌లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్రం విశిష్టతను చినజీయర్ స్వామి హోంమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు.
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.