telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

జంక్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు

జంక్ ఫుడ్ (చెత్త తిండి) అంటే ఏమిటి? జంక్ ఫుడ్ అంటే నా ఉద్దేశ్యం అనారోగ్యకరమైన ఆహారం. పారిశ్రామికంగా తయారయ్యినవి, మనం బయట తినే పిండి వంటలు ఎక్కువగా ఈ కోవ కింద వస్తాయి. ఇంట్లో చేసుకొనేవాటిలో జంక్ ఫుడ్ ఉండవచ్చును.

#జంక్_ఫుడ్_లో_ఏమి_ఉంటుంది? #ఏమి_ఉండదు?

#క్యాలోరీలు: తిండి శక్తినిస్తుంది. ఈ శక్తిని క్యాలోరీలు అంటారు. జంక్ ఫుడ్ లో క్యాలోరీల చిక్కదనం (calorie density) ఎక్కువగా ఉంటుంది. ఇవి తినేవారి శరీరాల్లో క్యాలోరీలు అవసరాన్ని మించి చేరుకుంటాయి. శరీరం వీటిని కొవ్వుగా మార్చుకుని దాచుకుంటుంది. వళ్ళు కొవ్వు పడితే అనేక అనర్ధాలు.

చక్కర(sucrose), మైదా, తెల్ల బియ్యం లాంటి పిండి పదార్ధాలు: వీటిలో ప్రధానంగా క్యాలోరీలే ఉంటాయి. మిగతా పోషక పదార్ధాలు ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు, విటమిన్లు అంత ఉండవు. క్యాలోరీ చిక్కదనం ఎక్కువ. మితులు దాటటం సులభం. ఇవి అలవాటు చేసుకుంటే వళ్ళు కొవ్వు పడుతుంది, బరువు పెరుగుతుంది. శరీరానికి నేరుగా హాని (proinflammatory effects) కూడా జరగవచ్చును.

వెన్న, నెయ్యి, వనస్పతి (డాల్డా): వీటిలోకూడా క్యాలోరీ చిక్కదనం ఎక్కువ. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరానికి నేరుగా హాని (proinflammatory effects) కూడా జరగవచ్చును. అదేపనిగా తింటే బరువు పెరుగుతుంది.

#నూనె_పదార్ధాలు: మామూలు నూనెలు, నూనె గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ, జంక్ ఫుడ్ లో బాగా మరిగించిన నూనె వాడతారు. వేడికి నూనెలో రసాయన మార్పులు వస్తాయి. హానికరమైన రసాయనాలు పుట్టుకొస్తాయి. వీటి వలన అనేక జబ్బులు రావచ్చును. కాన్సర్ రిస్కు కూడా పెరుగుతుంది.

#ఉప్పు: శరీరానికి ఉప్పు అవసరం స్వల్పం. జంక్ ఫుడ్ లో కనపడని ఉప్పు చాలా ఉంటుంది. దీని వలన బీపీ పెరగవచ్చును. ఆయుర్దాయం తగ్గవచ్చును.

#రసాయనాలు: రుచి కోసం, రంగు కోసం కలిపేవి. మనకు తెలిసిన, తెలియని హానికర పదార్థాలు ఉండవచ్చును.

#పోషకాల_లోపం: జంక్ ఫుడ్ లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు, విటమిన్లు తక్కువగా ఉంటాయి.

#యాంటి_ఆక్సిడెంట్_లాంటి_పదార్థాలు: ఇవి ఇంజిన్ కి గ్రీజు లాంటివి. ఇవి లోపించితే దీర్ఘకాలంలో అన్ని రకాల జబ్బులూ వస్తాయి. ఇవి ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారంలోనే ఉంటాయి. పిండివంటలలోనూ, జంక్ ఫుడ్ లోనూ అసలు ఉండవు. కొనుక్కుందాం అంటే దొరికేవి కావు.

 

చాలా మందికి జంక్ ఫుడ్ అలవాటు చిన్నతనంలోనే మొదలవుతుంది. పసితనంలో ఏర్పడిన రుచులు ఎల్లకాలం ఉండిపోతాయి. దుష్ఫలితాలు మాత్రం పెద్దయిన తరువాతనే వస్తాయి.

 

జంక్ ఫుడ్ అలవాటు అందరికీ ఒక్క లాగా ఉండదు. కొంత మందికి ముదిరి వ్యసనంగా మారుతుంది. దురద్రష్టవశాత్తూ, ఇది సమాజానికి తప్పుగా కనపడని వ్యసనం. ఐతే తాగుడు కూడా కొన్ని సమాజాల్లో తప్పు కాదని గ్రహించాలి.

 

మిగతా వ్యసనాల లాగానే మానసిక వత్తిడి, డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలు ఉన్నవారికి జంక్ ఫుడ్ వ్యసనం వచ్చే రిస్కు ఎక్కువగా ఉంటుంది.

 

జంక్ ఫుడ్ వ్యసనంగా మారిన వారు అది మానలేరు. ఇతర వ్యసనాల లాగానే దీనికి చికిత్స కష్టము. చివరికి ఒకోసారి తిండి వంటబట్టకుండా ఆపరేషన్ (bariatric surgery)చేయించుకోవాల్సి వస్తుంది.

 

#జంక్_ఫుడ్_నుండి_పిల్లలను_ఎలా_రక్షించుకోవాలి? పూర్వం పిల్లలను తోడేళ్ళనుండి, పులుల నుండి రక్షించుకునే వాళ్ళం. ఇప్పుడు జంక్ ఫుడ్ నుండి రక్షించుకునే రోజులు వచ్చినయ్యి. ఇది అంత సులభం కాదు.. నాకు తోచిన సూచనలు:

 

పెద్దవారి ప్రభావం: బ్రాహ్మల పిల్లలకి మాంసం ఎందుకు అలవాటు కాదో ఆలోచించండి. జంక్ ఫుడ్ పట్ల పెద్దవారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు దృఢమైన విశ్వాసాలు, అలవాట్లు ఉండాలి. జంక్ ఫుడ్ ను సాధ్యమైనంత వరకు పిల్లల దృష్టిలో పడనివ్వకూడదు.

#మీడియా_ప్రభావం: టీవీ ద్వారానూ, ఇతరత్రానూ వచ్చే జంక్ ఫుడ్ ప్రచారాన్ని ఎలా అపగలం? ఎలక్ట్రానిక్ వినోదం విషయంలో కుటుంబానికి కఠినమైన నియమాలు ఉండాలి. టీవీ పిల్లల వికాసానికి అనేక రకాలుగా అవరోధం.

బయటి తిండి సంస్కృతి: ఇది తగ్గాలి. జీవితంలో సరదాలు నింపుకోవటానికి వేరే మార్గాలు చాలా ఉంటాయి.

పుట్టినరోజులు, ఇతర వేడుకలు: ఆడంబరం లేకుండా అర్ధవంతంగా ఉండేలా చేసుకోవాలి. జంక్ ఫుడ్ విలువ తగ్గించాలి.

#తాత_అమ్మమ్మలు: పిల్లల పెంపకంలో తాత అమ్మమ్మల పాత్ర వెల లేనిది. ఐతే తల్లిదండ్రులకు, తాత అమ్మమ్మలకు పిల్లల తిండి విషయంలోనూ, క్రమశిక్షణ విషయంలోనూ భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి . పసి మనసులకు పరస్పర విరుద్ధమైన సంకేతాలు చేరకూడదు.

పిల్లల తిండి విషయంలో ప్రాధమిక నియమాలను మరచిపోకూడదు.

మీరు తినేదే మీ పిల్లలకు పెట్టుకోండి. మీరు తినని తిండి మీ పిల్లలకు ఎప్పుడూ పెట్టకూడదు. అందరూ మంచి తిండే తినండి. మంచి తిండి ప్రకృతికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. వీలైనంత వైవిధ్యం ఉండాలి.

సాధ్యమైనంత వరకూ కుటుంబంలో అందరూ కలసి తినండి. తిండికి ఉన్న సాంఘిక కోణం గ్రహించండి. మీ పిల్లలు మీ నుండి అంతర్లీనంగా నేర్చుకుంటున్నారని కూడా గ్రహించండి.

తినమని ప్రోత్సహించకండి. తినినందుకు గాని, తిననందుకు గాని మెచ్చుకోకండి. తినకపోతే ప్రత్యామ్నాయంగా ఏమీ తయారు చేసి పెట్టకండి.

ఇది తింటే బలం. అది తింటే బలం అని చెప్పకండి. ఎందుకంటే ఇది అసత్యం. ఏ పదార్ధమైనా చెడ్డది కావచ్చును, మంచిది కావచ్చును సందర్భాన్ని బట్టి. ఈ విషయం అర్ధం చేసుకునే అంత లాజిక్ పిల్లలకు ఉండదు. తీపి చెడ్డదని కూడా చెప్పనక్కరలేదు. తీపి చెడ్డదని చెప్పి తీపి వస్తువులు వేడుకలలో పెట్టటం మానెయ్యగలరా? ఇలా చెప్పటం వలన, పిల్లలకు మానసికంగా తిండితో అనారోగ్యకరమైన సంబంధం ఏర్పడే రిస్కు ఉంది.

సాధ్యమైనంత వరకూ తిండి టైం ప్రకారం పెట్టండి. టైం ప్రణాళిక మీ అవసరాలని బట్టి, మీ కుటుంబావసరాలని బట్టి వేసుకోండి.

ఏమీ తినక పోయినా ఫరవా లేదు. మీరు తినేటప్పుడు టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకోండి. తినక పొతే మళ్ళీ టైం వచ్చేవరకు ఆగటం అలవాటు చెయ్యండి. ఆకలి విలువ తెలియాలి.

ఒకోసారి పిల్లలు ఎప్పుడూ ఒకటే తింటామని అంటారు. ఉదాహరణకి వట్టి అన్నం. ఇంకేమీ తినరు. ఇదేమీ కొంప మునిగే విషయం కాదు. చూసీ చూడనట్లు వదిలెయ్యండి. వారే దారిలోనికి వస్తారు. మన పని అవకాశాలు కల్పించడం, అడ్డు పడటం కాదు.

తినేటప్పుడు దృష్టి తిండి మీదనే ఉండాలి. వినోదం అంటే (టీవీ, కంప్యూటర్, ఫోన్) లాంటివి అసలే ఉండకూడదు. ఈ విషయంలో కుటుంబంలో కఠినమైన నియమాలు ఉండాలి. ఆటపాటలు, వాదసంవాదాలు కూడా ఉండకూడదు.

తిండిని కానుక (reward)గా వాడకండి. ఆకు కూర తిన్నందుకు ఐస్ క్రీమ్ బహుమానం కాకూడదు. ఏడుస్తుంటే ఊరుకోబెట్టటానికి చిరుతిండి పెట్టకండి

పిల్లలకు వారి వయసుకు తగ్గట్టుగా కొన్ని వంటపనులు, ఇంటి పనులు అప్పచెప్పండి. దీని వలన మీకు పని పెరగవచ్చు. కానీ పిల్లలకు మేలు జరుగుతుంది. ఏం వండాలి, ఎలా వండాలి, అని పిల్లలని సంప్రదిస్తూ ఉండండి. వారి స్నేహితులని మీతోపాటు భోజనానికి అప్పుడప్పుడూ పిలవండి.

Related posts