telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

26 ఏళ్ళుగా తల లోపల ఉండిపోయిన కత్తి… తాజాగా తొలగించిన వైద్యులు

Knife

అతడి పేరు డౌరీజియే. చైనాలోని హైయాన్‌లో నివసిస్తున్నాడు. 1994లో దుండగులు అతడిపై దాడి చేశారు. అతడి తలలోకి కత్తిని దించారు. దీంతో డౌరిజియే స్పృహతప్పి పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో పడివున్న అతడు చనిపోయాడని అంతా భావించారు. హాస్పిటల్‌కు తరలించగా అతడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసింది. అయితే, తలలోకి చొచ్చుకెళ్లిన కత్తిని బయటకు తీస్తే మరింత రక్తస్రావమై చనిపోయే ప్రమాదం ఉందని తెలిసి వైద్యులు కత్తిని లోపలే ఉంచి కట్లు కట్టేశారు. అదృష్టవశాత్తు డౌరీజియే ఆరోగ్యంతో కోలుకున్నాడు. అయితే అతను ఆ కత్తిని వెలికి తీయించుకొనేందుకు డౌరీజియే చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. కానీ, ఆ కత్తిని తీస్తే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు వెనుకడుగు వేశారు. డౌరిజియేకు ఇప్పుడు 76 ఏళ్లు. వయస్సుతోపాటే అతడి తలలో ఉన్న కత్తి వల్ల కూడా సమస్యలు పెరిగాయి. తీవ్రమైన తలనొప్పి అతడిని వేధించేది. ఎడమ చేయి, భుజానికి పక్షవాతం వచ్చింది. దృష్టి కూడా తగ్గిపోయింది. కుడి కన్ను మసక మసకగా కనిపిస్తుండటంతో అతడి మరోసారి వైద్యులను సంప్రదించాడు. దీంతో వైద్యులు షాందాంగ్ క్వియాఫోషాన్ హాస్పిటల్‌‌కు వెళ్లాలని డౌరీజియేకు సూచించారు. వైద్యులు చెప్పినట్లే అతడు ఏప్రిల్ 2వ తేదీన ఆ హాస్పిటల్‌కు వెళ్లాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. అతడి తలలో కత్తిని చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని తొలగించడం చాలా ప్రమాదకరమని, ఒక వేళ అలా వదిలేసినా అతడు నరకయాతన అనుభవిస్తాడని వైద్యులు భావించారు. శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 4 ఇంచుల పొడవు, 1.2 ఇంచుల వెడల్పు ఉన్న ఈ కత్తి అతడి తలలోని పుర్రె నుంచి నేరుగా మెదడులోకి చొచ్చుకెళ్లింది. దీన్ని తొలగించేందుకు చీఫీ న్యూరోసర్జన్ లియు గౌంగ్‌కున్ ముందుకొచ్చారు. సుమారు రెండు గంటలు శ్రమించి తలలో తుప్పుపట్టిన ఆ కత్తిని విజయవంతంగా బయటకు తీశారు. ఏప్రిల్ 8న అతడికి రెండోసారి చికిత్స అందించారు. ఈసారి కత్తివల్ల ఏర్పడిన గాయాలకు చికిత్స అందించారు. ఇప్పుడు అతడు పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత అతడు సాధారణంగా నడుస్తున్నాడని, తలనొప్పి కూడా తొలగిపోయిందన్నారు. కంటి చూపు కూడా తిరిగి వచ్చిందన్నారు. ఇది నిజంగా ఓ అద్భుతమని పేర్కొన్నారు.

Related posts