telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జి.ఎస్.టి కౌన్సిల్ సమావేశం : రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Nirmalasitaraman

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 43 వ “వస్తు, సేవల పన్ను” మండలి ( జి.ఎస్.టి కౌన్సిల్) సమావేశం అయింది. సుమారు 7 నెలల తర్వాత సమావేశం జరిగింది. 2017 సంవత్సరం జులై నెల నుంచి GSTR (3B) రిటర్న్ ఫైల్ చేయడం ఆలస్యం అయితే, విధించే “లేటు ఫీజు”ను తగ్గించే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకొనేందుకు కొనుగోలు చేసే “ఆక్సిజన్ కాన్సంట్రేటర్”పై ఉన్న 12 శాతం జి.ఎస్.టి ( వస్తు, సేవల పన్ను) ను తొలగించే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. “ఆక్సిజన్ కాన్సంట్రేటర్”పై ఉన్న 12 శాతం జి.ఎస్.టి విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు కూడా “రాజ్యాంగ విరుద్దం” అని ఇటీవల వ్యాఖ్యనించింది. “కోవిడ్-19” సంబంధిత ఔషధాలు, వ్యాక్సిన్ లు, వైద్య పరికరాలు పై జి.ఎస్.టి రేటు తగ్గించే అంశంపై చర్చ జరిగింది. జి.ఎస్.టి అమలు వల్ల ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు, చెల్లించాల్సిన నష్ట పరిహారంను కేంద్రం ఏ రకంగా సమకూర్చు కోవాలనే అంశంపై చర్చ జరిగింది. 2017 సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన సుమారు 2.69 లక్షల కోట్ల రూపాయలపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రాలు “వాట్” (వాల్యూ ఆడెడ్ టాక్స్) ను విధించే హక్కును వదులుకోవడంతో, ఆ మేరకు రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందుకు గాను, లగ్జరీ వస్తువులు, ఆల్కహాల్, పొగాకు లాంటి వస్తువులపై అదనంగా “సెస్” వేసి 1.11 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని కేంద్రం యోచన చేస్తోంది.

మిగిలిన 1.58 లక్షల కోట్ల రూపాయలను రుణం ద్వారా సేకరించి, రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన మొత్తానికి, “సెస్” విధింపు ద్వారా సమకూర్చుకోనున్న మొత్తానికి వ్యత్యాసం ఇంకా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కొంత పరిస్థితి మెరుగుపడవచ్చనే ఆశాభావంతో కేంద్రం ఉన్నట్లు సమాచారం. గత ఆర్ధిక సంవత్సరంలో, రాష్ట్రాల తరఫున కేంద్రం 1.10 లక్షల కోట్ల రూపాయలను రుణం తీసుకుని, మిగిలిన 68, 700 కోట్ల రూపాయలను “సెస్” విధింపు ద్వారా సమకూర్చుకుని రాష్ట్రాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించింది. జి.ఎస్.టి చట్టం ప్రకారం జి.ఎస్.టి అమలైన 2017 సంవత్సరం జులై నెల నుంచి, మొత్తం ఐదేళ్ల పాటు, ప్రతి రెండు నెలలకూ రాష్ట్రాలు కోల్పోయే ఆదాయం మేరకు, కేంద్రం నష్టపరిహారం చెల్లించాలి. అటు అన్ని “కోవిడ్” సంబంధిత వైద్య పరికరాలపై జి.ఎస్.టిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి బిజేపి యేతర పార్టీలు. ఇందులో భాగంగా రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సంయుక్త వ్యూహంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2017 నుంచి ఐదేళ్ళ పాటు మాత్రమే కాకుండా, 2022 తర్వాత కూడా రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే నష్టపరిహారం కొనసాగాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related posts