telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ పై గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసలు…

gambir praised kohli on winning series

దూకుడుగా ఆడడంలో ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాయేతర క్రికెటర్లలో అన్ని తరాలకు భారత సారథి విరాట్‌ కోహ్లీని మించిన ఆటగాడు లేడని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసించాడు. కోహ్లీలో తమ దేశ ఆటగాళ్ల లక్షణాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నాడు. తన దూకుడుతో టెస్టు ఫార్మాట్‌కు రక్షకుడిగా నిలుస్తున్న అత్యంత ముఖ్యమైన క్రికెటర్‌ కోహ్లీ అని ఛాపెల్‌ తెలిపాడు. విరాట్ 86 టెస్టుల్లో 7240 పరుగులు చేశాడు. 27 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు బాదాడు. తాజాగా గ్రెగ్‌ చాపెల్‌ మాట్లాడుతూ… ‘గతంలో భారత జట్లు గాంధేయ సూత్రాన్ని పాటించేవి. అవసరం లేకపోయినా ప్రత్యర్థి జట్లతో గౌరవపూర్వకంగా ఆడేవి. ఈ దృక్పథాన్ని మార్చిన మొట్టమొదటి కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ. అయితే ఈ సూత్రం భారత్‌లో పని చేసింది కానీ విదేశాల్లో ఫలితాల్ని ఇవ్వలేదు. విరాట్‌ కోహ్లీ పూర్తిగా భిన్నం. దూకుడుకు ప్రతినిధి. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించాలన్నది అతడి ఆలోచన’ అని అన్నాడు.

‘క్రికెట్‌ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆస్ట్రేలియన్‌ కాని ఆస్ట్రేలియన్‌ ఆటగాడు. సరికొత్త టీమిండియాకు ఉదాహరణ. అత్యంత విలువైన ఆటగాడిగా.. క్రికెట్లో శక్తిమంతమైన జట్టుకు సారథిగా ఆట ఆదరణ కోసం బాధ్యతగా కృషి చేస్తున్నాడు. కోహ్లీకి ఎల్లప్పుడూ టెస్టు క్రికెటే అత్యున్నతమైనది. విరాట్ మరింత ఫిట్‌గా.. బలంగా ఉండటానికి టెస్టు క్రికెట్‌ దోహదపడుతుంది’ అని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్ ఛాపెల్‌ వివరించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్ ముగిసింది. ఇక అందరి దృష్టి నాలుగు టెస్టుల సిరీస్‌పైనే పడింది. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది. అయితే పితృత్వ సెలవులపై కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. 2018-19 పర్యటనలో మాదిరిగా భారత్ టెస్టు సిరీస్‌ విజయాన్ని పునరావృతం చేయాలంటే గతంలో ఛతేశ్వర పుజారా, జస్ప్రీత్ బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.

Related posts