దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పేదలు దిక్కులేని వారయ్యారని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం అన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నారనడానికి బపోలెడు సాక్ష్యాలున్నాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రైతులుచేతులు సాచి నిల్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హృదయం లేని కేంద్ర ప్రభుత్వం మాత్రమే చూస్తూ కళ్లప్పగించి ఊరుకుంటుందని ఆయన దుయ్యబట్టారు.
ఆయన కేంద్రానికి రెండు ప్రశ్నలు సంధించారు. ప్రతి పేద కుటుంబానికి నగదు బదిలీ చేయడం ద్వారా వారిని ఆకలి నుంచి ఎందుకు కాపాడడం లేదు? ఎఫ్‌సీఐ గోదాముల్లోని 77 మిలియన్ టన్నుల ధాన్యంలో కొద్దిమొత్తం ఉచితంగా ఎందుకు పంపిణీ చేయడం లేదు? అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని చిదంబరం ఆరోపించారు.