ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు కానీ ఆఖరికి నాటువైద్యుడి కంటే అధ్వానంగా తయారయ్యాడని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల ప్రయోగం వికటించడం ఖాయమని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతం న్యాయ రాజధానిగా మారదని స్పష్టం చేశారు.
హైకోర్టుకు సంబంధించి జగన్ చేతుల్లో ఏమీ లేదని, ప్రతిపాదన చేయడం వరకే ఆయన పనని పేర్కొన్నారు. చేతనైతే హైదరాబాద్ నుంచి తెలుగు సినీ రంగాన్ని విశాఖకు తెప్పించని సవాలు విసిరారు. టూరిజం క్యాపిటల్ గా, ఐటీ క్యాపిటల్ గా విశాఖ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందన్నారు. ప్రత్యేక హోదా తెప్పించకుండా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా మరేదో చేయడం సరికాదని ఆయన దుయ్యబట్టారు.