భారత్ క్యాన్సర్ బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉందని, ఇది చాలా తీవ్ర సమస్య అని రాజ్యసభలో సిపిఎం ఎంపి కెకె రాగేష్ పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్సను సామాన్య రోగులకు అందుబాటులోకి తేవడంతోపాటు దానికి సంబంధించిన ఇతర ప్రాథమిక సౌకర్యాలు కల్పించాల్సిన తక్షణావసరంపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 96 లక్షలమంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారని, మన దేశంలో ప్రతి ఏడాది కొత్తగా లక్ష క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని, గత రెండు దశాబ్దాల్లో క్యాన్సర్ రోగులు రెట్టింపు అయ్యారని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తోందని అన్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్యని అన్నారు. వంశపారపర్యంగా, జన్యు పరమైన కారణాలతో వచ్చిన క్యాన్సర్ కేసులు 5 నుంచి 10 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపారు.
90 శాతం క్యాన్సర్ కేసులు ఆల్కహాల్, పొగాకు వాడకం వంటి అనేక కారణాలతోనే నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్యాకేజి ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా క్యాన్సర్ కేసులు అధికమవుతున్నాయన్నారు. తినే తిండి కలుషితం అవుతోందని, ఆహార పదార్ధాల్లో ప్రమాదకర రసాయనాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అయొడిన్ సాల్ట్‌లో క్యాన్సర్ ప్రభావిత కారకాలు ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, క్యాన్సర్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించి, ఏయే కారణాలతో క్యాన్సర్ వ్యాపిస్తుందో పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవగాహన లేకపోవడం, ఆలస్యంగా వైద్యం అందించడం వల్ల చాలా మంది క్యాన్సర్ రోగులు మరణిస్తున్నారని అన్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే క్యాన్సర్ సెంటర్లను బలోపేతం చేయాలని కోరారు. ప్రతి రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, ఆరోగ్య నిధిని ఏర్పాటు చేయాలని కోరారు.