telugu navyamedia
రాజకీయ

పార్టీ నుంచి తనను బలవంతంగా వెళ్లిపోయేలా చేశారు -రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్‌

కాంగ్రెస్ పార్టీపై  గులాం నబీ ఆజాద్ మ‌రో సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జీ 23 నుంచి తాము లేఖ రాశామని, అప్పటి నుంచే తనపై కాంగ్రెస్ అసంతృప్తి ప్రదర్శించిందని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో క్లోజ్‌గా ఉన్నారని, ఇద్దరికీ లోపాయికారిగా సంబంధం ఉన్నదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను మోడీ పంచన చేరుతున్నట్టు కల్పిత కథలు అల్లుతున్నారని తెలిపారు.నిజానికి ప్రధాని మోడీతో కలిసిపోయింది తాను కాదని.. రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రధాని మోడీని కౌగిలించుకున్నది ఎవరు అని ప్రశ్నించారు.

తనను విమర్శించడానికి కాంగ్రెస్‌కు మోడీ ఒక సాకు మాత్రమే అని అన్నారు. నిజానికి మోడీని హగ్ చేసుకున్నది త‌న‌ని కాదని, రాహుల్ గాంధీ అని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడంపై వ్యాఖ్యానిస్తూ సొంత ఇంటి నుంచి తనను బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆజాద్ వాపోయారు.

కాంగ్రెస్‌ పార్టీకి అత్యవసరంగా ఔషధాలు అవసరమని గులాం నబీ ఆజాద్​ అన్నారు. అయితే పార్టీకి డాక్టర్లకు బదులుగా కాంపౌండర్లు వైద్యం అందిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయడానికి నాయకత్వానికి సమయం లేదని విమర్శించారు.

రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకులను ఏకం చేయకుండా, వారు పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు. 

రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీల పనితీరుతో రాహుల్ గాంధీకి ఎటువంటి పోలిక లేదన్నారు. తాను పార్టీలో ఉండటం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదని.. తాను పార్టీ విడిచి వెళ్లిపోవాలని వారు కోరుకున్నారని చెప్పారు. 

తాను కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీడానని, పార్టీ మూల సిద్ధాంతాన్ని కాదని స్పష్టం చేశారు. మనిషి పేరు మార్చుకున్నంత మాత్రన.. రక్తం, రూపు రేఖలు మారవు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో తనకు 8 రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తే 7 రాష్ట్రాల్లో గెలిచామని.. ప్రస్తుతం రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్ని ఓటములే అంటూ ఘాటూగా స్పందిచారు. తాను పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బలోపేతానికి సీనియర్లతో మాట్లాడాలని ఎన్నోసార్లు రాహుల్ గాంధీకి సూచించానని.. తన మాటలను రాహుల్ గాంధీ లెక్క చేయలేదన్నారు.

రాహుల్ గాంధీని విజయవంతమైన నేతగా నిలపాలని తీవ్రంగా యత్నించామని, అయితే విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. ఆ దిశగా రాహుల్‌కు ఆసక్తే లేదన్నారు. ఇందిరా కుటుంబంపై తొలినాటి నుంచీ ఉన్న గౌరవం ఇప్పటికీ సోనియా, రాహుల్‌లపై తనకుందన్నారు.రాహుల్ గాంధీ ఏమి చేస్తున్నారో సోనియాగాంధీ పట్టించుకోలేదని గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Related posts