ఈ నెల 23 తర్వాత ఏపీ పౌరుషం ఏంటో మోదీ, జగన్, కేసీఆర్‌లకుతెలుస్తుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో నరేంద్రమోదీ, జగన్, కేసీఆర్‌లకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని యామిని అన్నారు. ఏపీలో టీడీపీని ఓడించేందుకు అనేక కుట్రలు చేశారని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సమీక్షలు నిర్వహిస్తుండగా ఏపీలో సమీక్షలకు ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిందని విమర్శించారు. ప్రధాని మోదీ..మేక్ ఇన్ ఇండియా పెట్టాక ఒక్క కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కరువైందన్నారు. మహిళలు తనకే ఓటేశారని మోదీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హిట్లర్ పాలనను తలపించిన మోదీకి మహిళలు ఓట్లు వేయరని తెలిపారు. మే 23 తర్వాత మోదీ హిమాలయాలకు వెళ్లడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.