పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో కాశ్మీర్ వేర్పాటువాద నేతలకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 155 మంది రాజకీయ నాయకులకు భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ గవర్నరు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులకు భద్రత అవసరం లేదని సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఐఏఎస్ అధికారిగా ఉండి ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైజల్ కు ఉన్న సెక్యూరిటీని సైతం హోంశాఖ అధికారులు తొలగించారు. దీంతో వెయ్యిమంది పోలీసులతోపాటు వంద వాహనాలు పోలీసు శాఖకు తిరిగివచ్చాయి. వీటిని పోలీసు పహరాకు వినియోగించాలని నిర్ణయించారు. రాజకీయ నాయకులతో పాటు 18 మంది హురియత్ నేతలు, ఎస్ఎఎస్ గీలానీ, అబ్దుల్ ఘనీ షా, యాసీన్ మాలిక్, మమ్మద్ ముసాదిఖ్ భట్ ల భద్రతా సిబ్బందిని తొలగించారు.