కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్తూ ఆపై ఫేక్ సర్టిఫికేట్లను అమ్మడం బెంగళూరు సిటీలో సంచలనంగా మారింది. అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కొన్ని ఆసుపత్రులకు ఇప్పుడు కరోనా పరీక్షలు వరంలా మారాయి. కర్నాటకలోని బెంగళూరు నగరంలో పలు ఆసుపత్రులు కరోనా టెస్టుల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నవైనం కలకలం రేపుతోంది. ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కరోనా టెస్టులు తప్పనిసరి. ఈ నిబంధననే కొన్ని ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి.
క్వారంటైన్ కు భయపడి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లు మరికొందరు ఇలా ఎవరికి వాళ్లు అవసరమైన రీతిలో సర్టిఫికేట్లు దక్కించుకుంటున్నారు. బెంగళూరు సిటీలో ఇప్పటికే భారీగా తప్పుడు అడ్రస్, ఫేక్ ఫోన్ నెంబర్లతో కూడా సర్టిఫికేట్లు జారీ చేశారని సమాచారం. మరి ఈ సర్టిఫికేట్లు పట్టుకుని విచ్చలవిడిగా సంచరించి ఇతరులకు వైరస్ అంటిస్తే పరిస్ధితులు ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. నకిలీ రిపోర్టులు ఇచ్చి మోసగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజామాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.