వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలాతోనే కియా మోటార్స్ ను పక్క రాష్ట్రానికి తరలించబోతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందనే వార్త నేపథ్యంలో దేవినేని స్పందించారు. వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కియా పరిశ్రమలోని ఓ అధికారిని బెదిరించడం మీడియాలో మనమంతా స్పష్టంగా చూశామని తెలిపారు. ఈ ఘటనను మీడియాలో చూసిన అనేక సంస్థలు… ఎందుకొచ్చిన తలనొప్పి అనే భావనతో ఇప్పటికే పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు.
కియా మోటార్స్ తో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు పారశ్రామిక కళ వచ్చిందని, వేలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని దేవినేని ఉమా అన్నారు. అలాంటి పెద్ద పరిశ్రమ కియా తరలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కియా మోటార్స్ తరలింపుపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.