*ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. మంత్రులకు ఇదే చివరి సమావేశం
*ఎమోషనల్‌గా కనిపించిన మంత్రులు..
*వెలగపూడిలో మంత్రలుకు విందుభోజనం..
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో మార్పులు, 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ చివరి భేటీలో చర్చించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కూడా చర్చించనున్నారు.
అయితే ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు రాజీనామాలు చేయనున్నారు. అనంతరం వారి రాజీనామా పత్రాలను జీఏడీ అధికారులు గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లనున్నారు.
నూతన మంత్రి వర్గం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత మంత్రివర్గంతో నిర్వహించే చివరి సమావేశం ఇదే కావడంతో మంత్రులతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎవరెవర్నీ తీసేస్తున్నారు.. ఎందుకు తీస్తున్నారో వివరించి చెప్పనున్నారు. చాలా మంది మంత్రులకు మంత్రిగా ఇదే చివరి రోజు కావడంతో ఆయా ఛాంబర్లలో సందడి వాతావరణం కనిపించింది.
చివరి నిమిషంలో పెండింగ్ ఫైళ్లపై మంత్రులు చకాచకా సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. మంత్రులను కలిసేందుకు అధికారులు, సన్నిహితులు రావడంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది. అయితే సామాజిక సమీకరణాలు, జిల్లాల పరంగా కొత్తగా మంత్రి పదవి చేపట్టే వాళ్లు ఎవరో అనే ఉత్కంఠ మాత్రం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గానికి సంబంధించిన జాబితా ఈ నెల 10న వెలువడే అవకాశం ఉంది.