telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి

Vijaya Shanthi Comments KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ బొమ్మను, కార్ గుర్తును, టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం పై ఆమె ఘాటుగా స్పందించారు. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్‌ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతోందని విమర్శించారు.

తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారని అన్నారు. అలాంటి, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ, ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. “ధర్మో రక్షతి రక్షితః” అనే హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నానని, విజయశాంతి తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.

Related posts