telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

అనంతరం వైఎస్సార్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ​ఘనంగా నిర్వహిస్తున్నారు.

కాగా సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి తాడేపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న రెండ్రోజులపాటు జరిగే వైసీపీ ప్లీనరీలో పాల్గొని సమావేశాలు ప్రారంభిస్తారు . ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు. 

ప్లీనరీ మొదటి రోజు సీఎం జగన్‌ ప్రసంగంతో ప్రతినిధుల సభమొదలవుతుంది. మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన, మంత్రులు మాట్లాడతారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం, సాధికారిత మహిళా భద్రత వంటి నవరత్నాల హామీలపై తొమ్మిది తీర్మానాలు ప్రవేశ పెడతారు. శనివారం రెండోరోజున పార్టీ, ప్రభుత్వం ఇప్పటి దాకా అనుసరించిన వైఖరి, పాలనా విధానాలతోపాటు.. వచ్చే రెండేళ్లలో అనుసరించే వ్యూహంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారు. 

అలాగే మూడేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్, పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులను గుర్తు చేస్తూ నమూనా ఏర్పాటు చేశారు. విద్యుత్‌ దీప కాంతులతో  ప్రాంగణం ధగధగలాడుతోంది. రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు.

Related posts