telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ ప్లీనరీకి సర్వం సిద్ధం. .మ‌రికొద్దిసేప‌ట్లో ప్లీనరీ స‌మావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నిర్వ‌హిస్తున్న‌ వైసీపీ ప్లీనరీ స‌మావేశాలు మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ ప్లీనరీని నిర్వహిస్తోంది వైసీపీ.

రెండు రోజులపాటు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ వేదికకు వైఎస్సార్‌ ప్రాంగణం అని నామకరణం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా మొత్తం 400 మంది వరకు కూర్చునేలా ప్రధాన వేదికను సిద్ధం చేశారు.

ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ప్లీనరీ కావడంతో వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేందుకు వచ్చారు. ప్లీనరీలో దాదాపు 9 రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. తొలి రోజు ఐదు తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. రెండోరోజు సాయంత్రం అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను ఎన్నుకుంటారని చెబుతున్నారు.అనంతరం పార్టీ అధ్యక్షుడి హోదాలో సాయంత్రం 4 గంటలకు ప్లీనరీ ముగింపు ప్రసంగం చేస్తారు.

ప్లీనరీలో భాగంగా 2024వచ్చే ఎన్నికలకు వైసీపీ కార్యాచరణను, పార్టీ విధాన నిర్ణయాలనూ జగన్ ప్రకటిస్తారు.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ప్రసంగించనున్నారు.

కాగా..   ప్లీనరీకి హాజరుకావాలని గ్రామ/వార్డు సభ్యుడి నుంచి ముఖ్యనేతల దాకా అందరికీ జగన్‌ సంతకంతో కూడిన ఆహ్వాన లేఖలను పంపారు. తొలిరోజున లక్షన్నర మంది, రెండోరోజున నాలుగున్నర లక్షల మంది హాజరవుతారని వైసీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ రెండు రోజులూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు.. స్నాక్స్‌ కూడా అందిస్తారు.

వైసీపీ ప్లీనరీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. . వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఈనెల 8, 9 తేదీల్లో 16వ జాతీయ రహదారిపై వాహనాలు దారిమళ్లిస్తున్నట్టు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ ప్రకటించారు.

వైసీపీ ప్లీనరీ కారణంగా జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి దారి మళ్లిస్తున్నారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వాహనాదారులు వెళ్లాల్సి ఉంటుంది.

గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాలను బుడంపాడు మీదుగా తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా దారిమళ్లిస్తారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి దారిమళ్లించి గుడివాడ మీదుగా అవనిగడ్డ, రేపల్లె, చీరాల మీదుగా ఒంగోలు వెళ్లేలా ట్రాఫిక్ మళ్లించారు.

విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు దారిమళ్లిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లించి హనుమాన్‌ జంక్షన్‌ వైపు వెళ్లాలని పోలీసులు సూచిస్తు్న్నారు. చెన్నై వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే భారీ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు వద్ద జాతీయ రహదారిపై నిలిపివేయనున్నారు.

Related posts