telugu navyamedia
తెలంగాణ వార్తలు

మేడారానికి సీఎం కేసీఆర్‌

మేడారంలో జరుగుతున్న సమ్మక్క, సారక్క జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ వెళ్లనున్నారు. వనదేవతలు సమ్మక్క, సారక్క ల‌ను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకుంటారు.

గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి తెచ్చారు గిరిజన పూజారులు. రాత్రి 7.14 నిమిషాలకు ములుగు ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవస్తున్నట్లుగా భక్తులకు సంకేతమిచ్చారు. సమ్మక్క గద్దెపై కొలువు దీరడంతో ఒక్కసారిగా భక్తులు ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు.

స‌మ్మ‌క్క గ‌ద్దెపైకి తీసుకురావ‌డానికి ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్యతోపాటు దూపం, జలకం వడ్డెలు, సహాయక పూజారులు సాయంత్రం చిలుకల గుట్టపైకి వెళ్లారు. రహస్య ప్రదేశంలో సమ్మక్క రూపమైన కుంకుమ భరిణెకు ప్రత్యేక పూజలు చేశారు. అది పూర్తివ్వగానే తిరిగి బయల్దేరారు. ఆనవాయితీ ప్రకారం వనదేవతకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం స్వాగతం పలికారు.

 వనదేవతలైన సమ్మక్క, సారక్క గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యమంత్రి. అనంతరం తన ఎత్తు బెల్లంతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు కేసీఆర్.

సమ్మక్క సారలమ్మ జాతర రెండు రోజుల క్రితమే లాంఛనంగా స్టార్ట్ అయినా వారం పది రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. ఇప్పుడా తాకిడి మరింతగా పెరిగింది. ఎక్కడ చూసిన ఎటు చూసిన జనమే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు అరవై లక్షలకుపైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు.

జంపన్న వాగులో రాత్రి పగలు భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఆ వాగు చూస్తుంటే కుంభమేళాను తలపిస్తోంది.

కాగా..ఈనెల 16వ తేదిన ప్రారంభమైన మేడారం జాతర ఇద్దరు వనదేవతలు గద్దెను అధిష్టించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. ఇవాళ నిండు జాతర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Related posts