తెలంగాణలో ఈ నెల 14 వరకు అన్ని మద్యం దుకా ణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం దుకాణాల మూసివేత గడువు నిజానికి నిన్నటితో ముగిసింది. దీంతో ఈ రోజు తెరిచే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే, కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిన్న గడువును పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.