telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రైతులకు సీఎం కెసిఆర్ సూచన..ఆ పంట వేయద్దు

Kcr telangana cm

 ప్రగతి భవన్ లో   నిన్న అర్ధరాత్రి  అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ యాసంగి పంటలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఎవరికి తోచినట్టు వారుగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా, పై అధికారుల ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలని సూచించారు. మార్కెట్లో సరైన ధరలు లభించే అవకాశం ఉన్న పంటల రకాలను ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదే అని సీఎం అన్నారు. తమ ఇష్టానుసారం కాకుండా అన్ని జిల్లాల అధికారులు తమ ఉన్నతాధికారులనుంచి వచ్చిన ఆదేశాల మేరకే కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం దృష్ట్యా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆలోచనా ధృక్పథాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలన్నారు. తెలంగాణ సాగు బాగు కోసం వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి కుటుంబంలా సమన్వయంతో పనిచేయాలన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని, క్వింటాలుకు ఎనిమిది, తొమ్మిది వందల రూపాయలకు మించి ధర పలకడం కష్టసాధ్యమైన నేపథ్యంలో అదే ధరకు అమ్ముకోదలచిన రైతులు మాత్రమే మక్కపంట వేసుకోవాలనే విషయాన్ని మరింతగా అర్థం చేయించాలని సీఎం మరో మారు స్పష్టం చేశారు.
రేపు రాబోయే యాసంగి సీజన్ కు దాదాపు 70 లక్షల ఎకరాలు వ్యవసాయానికి సిద్ధమైనాయని ఉన్నతాధికారులు రిపోర్టులు సిద్దం చేసినారంటే.. దీన్నిబట్టి, తెలంగాణ వ్యవసాయం, దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని స్పష్టమైతున్నదని సీఎం అన్నారు.

తెలంగాణ ఏమి తింటుందో..మార్కెట్లో ఏ పంటకు ధర వస్తుందో తెలుసుకోని అందుకు అనుగుణంగా పంటలను పండించాల్సి ఉందని సీఎం సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో సాంకేతికతను, యాంత్రీకరణను విరివిగా ఉపయోగించాలని.. ఆ దిశగా రైతాంగాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం తెలిపారు. వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ బాధ్యతను భుజాన వేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ దిశగా సరియైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇందులో భాగంగా నాలుగంచెల వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. రైతులు సరియైన ధరలు వచ్చే పంటలను మాత్రమే పండించేందుకు ప్రణాళికలను తయారు చేయడం, కల్తీ విత్తనాలు మార్కెట్ లో లభ్యం కాకుండా జాగ్రత్త పడుతూ నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేయడం, సరియైన సమయంలో ఎరువులను అందించడం, రైతు పండించిన పంటకు మంచి ధరలు లభించేలా చూడడం.. ఈ నాలుగు రకాల మార్కెటింగ్ వ్యూహాలను పటిష్టంగా అమలు పరచాల్సివుంటదని అధికారులకు సీఎం వివరించారు. అట్లా వాటిని అన్వయించుకోని పోయినప్పుడు మాత్రమే అది గొప్ప వ్యవసాయంగా మారుతుందని స్పష్టం చేశారు.

Related posts