telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇవాళే షర్మిల సంకల్ప సభ.. ముఖ్య అతిథిగా వైఎస్‌ విజయమ్మ !

వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపడం మొదలు పెట్టారు. ఏప్రిల్‌ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని… లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. ఇందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలో షర్మిల సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభ ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత జరగనుండగా.. ఈ ఉదయం 8 గంటలకు ఆమె రోడ్డు మార్గాన ఖమ్మం బయలు దేరనున్నారు. ఉదయం 8 గంటలకు షర్మిల కాన్వాయ్‌ బయలు దేరనుండగా.. ఆమె వెంట తరలివెళ్లేందుకు ఇప్పటికే భారీ ఎత్తున షర్మిల అభిమానులు ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో లోటస్‌ పాండ్‌ దగ్గర సందడి మొదలైంది. ఉదయం 8 గంటలకు లోటస్‌పాండ్‌ నుంచి బయలు దేరి… 9.30 గంటలలకు హయత్‌నగర్‌ చేరుకుంటుంది. అక్కడ ఆమె అభిమానుల స్వాగతాన్ని స్వీకరిస్తారు. ఆపై చౌటుప్పల్‌, నకిరేకల్‌, సూర్యాపేట మీదుగా ఆమె కాన్వాయ్‌ సాగనుంది. దారిపొడవునా షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సాయంత్రం 5.15 గంటలకు ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు షర్మిల చేరుకోనున్నారు. అయితే…సంకల్ప సభపేరుతో నిర్వహించే ఈ తొలి సభకు మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి, షర్మిల తల్లి విజయలక్ష్మి హాజరుకానున్నారని సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts