అవినీతి ఏ స్థాయిలో ఉన్నా తాను సహించనని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదనిజగన్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ నిపుణులతో అమరావతిలో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన ఉద్దేశాలను అధికారులకు వివరించారు. వ్యవస్థలను బాగు చేసుకోవడానికి తపిస్తున్నానని, టెండర్ల విధానం మరింత పారదర్శకంగా ఉండాలన్నదే తన అభిమతమని తెలిపారు.
ఏపీ ప్రభుత్వ పారదర్శక విధానాలు దేశానికి ఒక సంకేతం పంపాలని సీఎం జగన్ అభిలషించారు. ఇప్పటికే టెండరింగ్ విధానాల పర్యవేక్షణకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా రెండ్రోజుల కిందట సాక్షి దినపత్రికలో పోలవరం ప్రాజక్టులో అవినీతి పేరిట వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పోలవరం నిర్మాణ పనుల్లో అక్రమాలపై నిజానిజాలు వెలికితీయాలని నిపుణులను ఆదేశించారు. ఓవైపు రాష్ట్ర ఆర్థికపరిస్థితి పతనం దిశగా పయనిస్తుంటే, అవినీతి వల్ల మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజక్టును గందరగోళంగా మార్చేసిందని ఆరోపించారు.