telugu navyamedia
తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో టీఆర్ఎస్ హ‌స్తం..

ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ( చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ మంచి పథకమని.. అయినప్పటికీ నిరసన తెలిపే పద్ధతి ఇది కాదని హితవు పలికారు. సికింద్రాబాద్ విధ్వంసం వెనుక ఎవరున్నారని బండి సంజయ్​ ప్రశ్నించారు. రాళ్లు వేసింది ఎవరో తెలియదని.. గోడలు కూల్చారంటూ అనుకోకుండా జరిగింది కాదని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.

ఇంటెలిజెన్స్ సమాచారం వున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రైల్వేస్టేషన్‌లోకి పెట్రోల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయారని సంజయ్ ఆరోపించారు. నిన్న సికింద్రాబాద్​లో జరిగిన నష్టానికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ నిన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం చెలరేగింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన వేలమంది ఆర్మీ ఆశావహులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 8 రైళ్లకు చెందిన బోగీలను తగులబెట్టారు. షాపులను లూటీ చేశారు. ఆర్టీసీ బస్సులపైనా దాడిచేశారు.

ఈ నిరసనల వెనక గుంటూరులోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు కీలక సూత్రధారి అని పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనలో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులే పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.

వీరంతా గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చారు. గుంటూరు‌తో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

Related posts