వలపు వయారాల
విరుల దండవై…
మదిని దోచే మరువంపు
సుమవల్లివై…
మధుర భావాలు పంచే
ప్రేమ పావురానివై…
నా హృదంతరాళంలో
ప్రణయ సింహాసనంపై
మహారాణివై…
కుంద పుష్ప వృష్టి
మందహాసాలు ఒలికిస్తుంటే-
చామంతీ – పూబంతీ
గుసగుసలాడుకుంటున్నాయి-
నిత్య సంక్రాంతి రంగవల్లిగా-
వలపు వాకిట
సిగ్గుల మొగ్గవుతున్న
ఓ ప్రేమ నికషా – యోషా-
నీ పైనే నాధ్యాస-
నీవే నా జన్మ జన్మల
వలపు కేదారంలో ఆశ-
అనురాగమయీ!
నాదు ఆత్మ శుద్ధికి
నాదు లక్ష్య సిద్ధికి
నీవే ఏకైక శ్రుతం
నీవే ప్రేమామృతం-
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి