telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జైలులో తోటి ఖైదీపై ఎమ్మెల్సీ అనంతబాబు దాడి ?..

కాకినాడ‌లో మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హ‌త్య కేసులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు రాజమహేంద్రవరం జైలులో తోటి ఖైదీపై దాడి చేశారని తెలుస్తోంది. ఏదో విషయంపై ఇద్దరికీ మాటా మాటా పెరగడంతో.. ఎమ్మెల్సీ కోపంతో అతని మీద చేయి చేసుకున్నారని సమాచారం.

నిబంధన ప్రకారం జైలులో ఉన్న వ్య‌క్తికి చిన్న గీత పడినా అక్కడి ఆస్పత్రిలో కారణం చెబితే తప్ప చికిత్స చేయరు. అయితే చికిత్స చేయించుకునే స్థాయిలో దెబ్బలు తగలలేదు అన్న వాదన కూడా వినిపిస్తోంది.

మరోపక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయి అని విశ్వసనీయ సమాచారం. రెండు రోజులకే పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశారు. కోరిన ఆహారం బయటినుంచి అందుతోంది. ఎమ్మెల్యేని జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులపై స్థానిక నేతలు.. పెద్ద స్థాయి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం ఖైదీలు ముగ్గురికి ఒక గది కేటాయిస్తారు. ఎమ్మెల్సీ ఒక్కరినే ఓ గదిలో ఉంచారని సమాచారం.

నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీని కుటుంబ సభ్యులు మాత్రమే కలవాలి. అది కూడా ఒకసారి ప్రత్యక్షంగా.. ఒకసారి నిర్దేశిత సమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ, ఎమ్మెల్సీ ఆనంతబాబు విషయంలో మాత్రం ఆయన రిమాండ్ కు వచ్చిన వెంటనే కొన్ని రోజులకు న్యాయవాదిని అని చెప్పి ఒకరు కలిశారు. ఆ తర్వాత రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కలిశారు.

ఆ తర్వాత కూడా అనధికారికంగా కొందరు ప్రజాప్రతినిధులు.. తరచూ కలుస్తున్నారు. ఆ విధంగా తనను కలవడానికి వచ్చిన వారి సెల్ ఫోన్ ద్వారా ఎమ్మెల్సీ తాను మాట్లాడాలని భావించిన వారితో మాట్లాడుతూ ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలపై జైలు సూపరింటెండెంట్ రాజారావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేద‌ని తెలుస్తోంది.

కాగా, మే 24న సుబ్రహ్మణ్యం హత్య జ‌ర‌గిన రోజు శంకర్ టవర్స్ వాచ్మెన్, సుబ్రహ్మణ్యం చిన్నాన్న… అసలు హ‌త్య‌ జరిగిన రోజు రాత్రి శంకర్ టవర్స్ దగ్గర అసలు ఎలాంటి ఘర్షణ జరగలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తాను గేటు పక్కనే ఉంటానని.. అలాంటిది ఏం జరిగినా తనకు తెలుస్తుందని వాచ్మెన్ అంటున్నారు..

అంతేకాక శంకర్ టవర్స్ కు అసలు సుబ్రమణ్యం రానే రాలేదని వాచ్ మెన్ అంటున్నారు. ఎమ్మెల్సీ అనంత బాబు అబద్ధాలు చెబుతున్నారు అంటున్నారు. అనంత బాబు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లారని.. మళ్లీ రాత్రి 1:00 కి తిరిగి వచ్చారని.. ఆ సమయంలో అనంత బాబుతో మేడం కూడా ఉన్నారని తెలిపారు. రాత్రి ఒంటిగంటకు భార్యతో కలిసి పైకి వెళ్లారని మళ్లీ కిందికి అనంత బాబు ఒక్కరే వచ్చారు అన్నారు.

అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ ని ఇప్పటికే పోలీసులు తీసుకున్నారని.. అందులో కూడా ఎలాంటి గొడవ రికార్డు కాలేదని సుబ్రమణ్యం చిన్నాన్న చెప్పారు. సుబ్రమణ్యం చిన్నాన్న చెబుతుందే నిజమైతే అనంత బాబు పోలీసులకు కట్టు కధ చెప్పినట్టు కన్ఫర్మ్ అయినట్టే..

సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య జ‌రిగ‌న రాత్రి 1:00 సమయంలో అనంత బాబుతో ఆయన భార్య కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారా అన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి.

Related posts