telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

వరంగల్ బావి హత్యలు : తల్లితో సహజీవనం… కూతురిపై కన్ను… వెలుగులోకి షాకింగ్ నిజాలు

Warangal

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట హత్యల విషయమై వరంగల్ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. 72 గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు ప్రధాన నిందితుడు సంజయ్‌ను సోమవారం సాయత్రం మీడియా ముందు హాజరుపరిచారు. ఒక హత్య నుంచి తప్పించుకోవడం కోసం నిందితుడు మరో 9 హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. “వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో జరిగిన దుర్ఘటన అందర్నీ కలచి వేసింది. 9 మంది శవాలను గిన్నీ గోడౌన్ పక్కనున్న బావి నుంచి మృతదేహాలను బయటకు తీశారు. గోడౌన్ యజమాని ఫిర్యాదు మేరకు మే 21న కేసు నమోదు చేశాం. ఆ బావిలో నుంచి ముందుగా మక్సూద్, ఆయన భార్య, కుమార్తె, మనవడి శవాలను వెలికి తీశాం’’ అని కమిషనర్ తెలిపారు. బావిలో నుంచి నీటిని తోడిన తర్వాత మే 22న మరో ఐదు శవాలను వెలికి తీశామన్న కమిషనర్.. కమిషనరేట్ పరిధిలో ఆరు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని, పకడ్బందీగా పని చేసి మిస్టరీని చేధించామన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ‘‘మక్సూద్ ఫ్యామిలీలో ఆరుగురు ఉన్నారు. మక్సూద్, ఆయన భార్య గోనె సంచుల ఫ్యాక్టరీలో పని చేస్తారు. శాంతి నగర్‌లో పని చేస్తుండగా.. వారికి సంజయ్ కుమార్ యాదవ్ అనే బిహార్ వ్యక్తి పరిచయం అయ్యాడు. మక్సూద్ భార్య నిషా అలం అక్క కూతురు రఫికా (37) ఐదేళ్ల క్రితం బెంగాల్ నుంచి ముగ్గురు పిల్లలను తీసుకొని వరంగల్ వచ్చింది. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె కూడా తన బాబాయి మక్సూద్ సాయంతో గోనె సంచుల తయారీలో పని చేసింది. సంజయ్ ఒంటరి కావడంతో రఫీకా అతడికి భోజనం వండి పెడుతూ డబ్బులు తీసుకునేది. అలా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అది సాన్నిహిత్యానికి దారి తీసింది. తర్వాత సహజీవనం ప్రారంభించారు. ఈ క్రమంలో రఫీకా కూతురు యుక్త వయస్కురాలైంది. ఆ అమ్మాయితో సంజయ్ సాన్నిహిత్యంతో ఉండేందుకు ప్రయత్నించగా.. రఫీకా మందలించింది. నిన్ను పెళ్లి చేసుకుంటాను, బెంగాల్ తీసుకెళ్లి ఇంట్లో వాళ్లతో మాట్లాడతానని చెప్పి సంజయ్.. రఫీకాతో కలిసి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ నుంచి మార్చి 7న బయల్దేరాడు. పక్కా ప్లాన్‌తో మజ్జిగ ప్యాకెట్లో నిద్ర మాత్రలు వేసి రఫీకాకు ఇచ్చాడు. ఆమె పడుకున్న తర్వాత వేకువ జామున 3 గంటలకు చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. చనిపోయాక రైళ్లో నుంచి బయటకు తోసేశాడు. అనంతరం రాజమండ్రిలో రైలు దిగి ఇంటికొచ్చాడు. నిడదవోలు ప్రాంతంలో రఫీకా బాడీని గుర్తించారు. తాడేపల్లిగూడెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల మక్సూద్ భార్య తన సోదరి కూతురైన రఫీకా ఎక్కడుందని సంజీవ్‌ను అడగటం మొదలుపెట్టింది. తన గురించి చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించింది. దీంతో తను చేసిన హత్య నుంచి తప్పించుకోవడం కోసం వారిని హతమార్చాలని భావించాడు. అందుకే మే 16 నుంచి వరకు తరచుగా గోడౌన్ దగ్గరకు వెళ్లాడు. మే 18న హన్మకొండలో నిద్ర మాత్రలు కొనుగోలు చేశాడు. మక్సూద్ పెద్ద కొడుకు పుట్టిన రోజు ప్లాన్ చేసుకొని మే 20న మక్సూద్ కుటుంబం నివసించే గోడౌన్ వద్దకు వెళ్లి.. అదను చూసి నిద్ర మాత్రలను పొడి చేసి తినే ఆహారంలో కలిపాడు. మక్సూద్ ఫ్యామిలీలో ఆరుగురితోపాటు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో.. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్ అనే ఇద్దరికి కూడా వాళ్ల ఆహారంలోనూ నిద్ర మాత్రలు కలిపాడు. షకీల్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉండగా.. మొత్తం 9 మంది అక్కడున్నారు. నిద్రమాత్రల కారణంగా అందరూ గాఢంగా మత్తులోకి జారారు. అదే అదనుగా ఒక్కొక్కరిని గోనె సంచిపై పెట్టి.. ఒక్కడే అందర్నీ బావిలో పడేశాడు. పైన ఉన్న ఇద్దరు బిహార్ యువకులను కూడా బావిలో తోసేశాడు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ పని చేశాడు. షకీల్ పర్సు, ఇతర సామాన్లు తీసుకొని ఉదయాన్నే సైకిల్ మీద తన ఇంటికి చేరుకున్నాడు. రఫీకా మర్డర్‌ను కప్పి పుచ్చుకోవడానికి మక్సూద్ ఫ్యామిలీలోని ఆరుగురితోపాటు మరో ముగ్గుర్ని హత మార్చాడు. సైకిల్ మీద ఇంటి నుంచి బయల్దేరిన సీసీటీవీ క్లిప్పింగులు ఆధారంగా మారాయి. దీంతో అతణ్ని అరెస్ట్ చేశాం. ఇలా ఒక్క హత్యను కప్పి పుచ్చుకోవడం కోసం మరో 9 హత్యలు చేశాం. చిన్న చిన్న ఆధారాలను కూడా సేకరించి అతి త్వరలోనే ఛార్జీషీట్ నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తాం. 72 గంటల్లోనే ఈ కేసును చేధించాం. షకీల్ పర్సు, ఇతర సామాన్లను అతడి ఇంట్లో గుర్తించాం’’ అని కమిషనర్ తెలిపారు.

Related posts