telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ కొత్త రికార్డు…

ఐపీఎల్‌ 2020లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో సత్తాచాటింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 146 పరుగుల లక్ష్యాన్ని చెన్నై18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధ సెంచరీతో మెరవడంతో చెన్నై అలవోకగా విజయం సాధించింది. డుప్లెసిస్‌, అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన చేశారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్‌ మోరీస్‌, యుజ్వేంద్ర చహల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. చెన్నై మ్యాచ్‌లో కోహ్లీ సిక్స్‌ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 200వ సిక్సర్‌ను సాధించాడు. చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 17వ ఓవర్‌ మూడో బంతిని ముందుకొచ్చిన కోహ్లీ సిక్స్‌ సాధించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో రెండొందల సిక్సర్లు కొట్టిన జాబితాలో విరాట్ కూడా చేరిపోయాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 336 సిక్సర్లు బాదాడు. బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నిలిచాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభం అయింది. మొదటి సీజన్‌ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు‌కే ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 187 మ్యాచ్‌లు ఆడాడు. 5,777 పరుగులు చేశాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు 499 ఫోర్లు, 200 సిక్సర్లు బాదాడు కోహ్లీ. ఐపీఎల్ 2020 జరుగుతున్న సమయంలోనే విరాట్ కోహ్లీ టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాదు టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు.

Related posts