telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే రజిని ఆకస్మిక తనిఖీ.. అధికారులపై ఆగ్రహం

MLA-Rajini-Vidadala ycp

గుంటూరు జిల్లా యడ్లపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని చిలుకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. 2018-2019 సంవత్సరానికి గాను నిధులలో తీవ్ర అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఆమె, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు ఒక కోటి 20 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. దీనిపై అధికారులను వివరణ కోరగా.. సంక్రాంతి సంబరాలకు ఖర్చు పెట్టామని వారు సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు.

ప్రభుత్వం నుంచి ఈ సంబరాలకు వచ్చే ప్రత్యేక నిధులు ఏమయ్యాయని మాజీ ఎంపీడీఓ స్వరూపరాణిని ప్రశ్నించగా ఆమె తెల్లమొహం వేశారు. ఆ నిధులు దుర్వినియోగం అయినట్టు నిర్ధారణకు వచ్చిన ఎమ్మెల్యే, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలకు, పబ్బాలకు ఎంపీపీ నిధులు ఖర్చు పెడతారా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం 25 % నిధులు మాత్రమే ఆఫీస్ ఖర్చులకు వాడాల్సి ఉండగా, 75 % నిధులు అంటే దాదాపు ఒక కోటి 20 లక్షల రూపాయల నిధులు పక్కదారిపట్టడంతో అక్కడి అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నిధుల దుర్వినియోగమై జిల్లా కలెక్టర్ ని విచారణ చేపట్టాలని కోరతామని, తప్పు చేసిన అధికారులకు శిక్ష తప్పదని రజిని హెచ్చరించారు.

Related posts