రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు అసహనం వ్యక్తం చేశాడు. ఎంతో ప్రతిభ కలిగిన శాంసన్ అనవసర తప్పిదాలతో వరుసగా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఎంత సేపు భారీ షాట్లు ఆడుతూ మూల్యం చెల్లించుకుంటున్నాడని, టీ20 క్రికెట్ అంటే ఎంతసేపు ఫోర్లు, సిక్స్‌లే కాదని చురకలంటించాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో గెలిచి ప్లే ఆశలను నిలుపుకున్న విషయం తెలిసిందే.
‘సంజూ శాంసన్.. టీ20 క్రికెట్ అంటే ఫోర్లు, సిక్స్‌లే కాదు. జట్టు విజయానికి తగ్గట్టు ఆడాలి. భారీ షాట్లు ఆడలేని పరిస్థితుల్లో క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో రన్ రేట్ మెయింటేన్ చేయాలి. కానీ నిర్లక్ష్యపు ఆటతో జట్టు విజయవకాశాలను దెబ్బతీయవద్దు. గత ఏడు మ్యాచ్‌లుగా శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. వికెట్ పడిన మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఆడితే ఏంత ప్రతిభ ఉన్నా పక్కన పెట్టేస్తారు.’అని వేణుగోపాల్ రావు సూచించాడు.
ఈ సీజన్ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన శాంసన్.. తువాతి 8 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో శాంసన్‌కు ఇది కొత్త కాదు. గత రెండు సీజన్లలో కూడా ఈ కేరళ బ్యాట్స్‌మెన్ ఇలాంటి ప్రదర్శననే కనబర్చాడు. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్ ఆడటం తర్వాత పత్తాలేకుండా పోవడం అతనికి అలవాటే. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనే భారీ సెంచరీతో చెలరేగిన శాంసన్ ఇప్పటిలానే అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రశంసలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత పది మ్యాచ్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.