telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో ఆ రికార్డు సాధించిన ఏకైన భారత ఆటగాడు…

ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్..‌ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. మొదటగా మ్యాచ్ టై కావడంతో సూపర్ ‌ఓవర్‌కు దారి తీయగా.. సూపర్‌ ఓవర్ కూడా‌ టైగా ముగిసింది. దీంతో మరోసారి సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. పంజాబ్‌ అద్భుత విజయం సాధించి లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. లీగ్‌ చరిత్రలో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ జట్టును ముందుండి నడిపించాడు.

ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒంటరి పోరాటం చేస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 9 ఇన్నింగ్స్‌లలో రాహుల్ 525 రన్స్ చేశాడు. అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ జట్టుపై అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా కూడా రాహుల్ నిలిచాడు. లీగ్ ఆరంభం నుంచి పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న ముంబైపై ఇప్పటిదాకా రాహుల్‌ 580 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో 77 పరుగులు చేసే క్రమంలో కేఎల్ రాహుల్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా మూడు సీజన్‌లలోనూ 500 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2019లో 593, 2018లో 659 రన్స్ చేశాడు రాహుల్. గతంలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ వరుసగా మూడు సీజన్లలో 500పై చిలుకు పరుగులు బాదాడు.ఇక భారత క్రికెటర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా కూడా మూడు సీజన్లలో 500కు పైగా పరుగులు చేశాడు.

Related posts