telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నేడే ఐపీఎల్ ఫైనల్ .. టైటిల్ చెన్నైకే.. !

ipl 2019 final today winning chances to chennai

ఐపీఎల్‌ 12వ అధ్యాయంలో చివరి అంకం నేడే. ధోని సారథ్యంలోని చెన్నై.. రోహిత్‌ నాయకత్వంలోని ముంబయిల మధ్య ఆదివారమే అంతిమ సమరం. వేదిక మన హైదరాబాదే. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై, మాజీ విజేత ముంబయి తాడోపేడో తేల్చుకోనున్నాయి. భారీ భద్రత మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఐపీఎల్‌లో ఎనిమిదోసారి ఫైనల్లో అడుగుపెట్టిన చెన్నైకి మరోసారి ముంబయి ప్రత్యర్థిగా నిలిచింది. మూడుసార్లు విజేతగా నిలిచిన చెన్నై నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇందులో రెండుసార్లు (2013, 15) ముంబయి చేతిలోనే ఓడింది. 2017లో ధోని సభ్యుడిగా ఉన్న పుణె సూపర్‌ జెయింట్స్‌నూ ఓడించింది రోహిత్‌ సేన. ఈ సీజన్లో రెండు జట్ల బలాబలాలు చూస్తే ముంబయిదే పైచేయి. మొత్తంగా చెన్నైపై ఆ జట్టుకు మెరుగైన రికార్డుంది. ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడితే.. ముంబయి 16 సార్లు గెలిచింది. చెన్నై 11 మ్యాచ్‌లు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయిదే పైచేయి. ఇదే ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. ఐతే చెన్నైని ఏ దశలోనూ తక్కువగా అంచనా వేయలేం. ధోని ఆ జట్టుకు కొండంత బలం. అతడి వ్యూహ చతురత చెన్నైకి తిరుగులేని అస్త్రం.

ముంబయి ప్రధాన బలం.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సమతూకంగా ఉండటం. ఓపెనింగ్‌లో రోహిత్‌, డికాక్‌.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌, కృణాల్‌, పొలార్డ్‌లతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోడానికి హార్దిక్‌, పొలార్డ్‌ సిద్ధంగా ఉంటున్నారు. ఈ సీజన్‌లో సూర్యకుమార్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటుండగా.. హార్దిక్‌, పొలార్డ్‌ విధ్వంసకర ఆటతో హోరెత్తిస్తున్నారు. ఇక డెత్‌ ఓవర్ల బౌలింగ్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమం అనదగ్గ బుమ్రా, మలింగ ఉండటం ముంబయి తిరుగులేని బలం. లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ చక్కటి ప్రదర్శనతో ముంబయి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తుదిజట్టు అత్యంత తక్కువ మార్పులు చేసింది చెన్నై. బ్యాట్స్‌మెన్‌ వరుసగా విఫలమైనా ఒక్క మ్యాచ్‌లోనూ తప్పించలేదు. ఆటగాళ్లపై నమ్మకముంచడం ధోని శైలి. ఈ నమ్మకమే చెన్నైని ఫైనల్‌ వరకు చేర్చింది. అవసరమైనప్పుడు వాట్సన్‌, డుప్లెసిస్‌లలో ఒకరు చెలరేగుతారు. సమయం వస్తే సురేశ్‌ రైనా, అంబటి రాయుడు బ్యాటుకు పని చెబుతారు. వీరంతా విఫలమైతే ధోని రంగంలో దిగుతాడు. ఈ సీజన్‌ మొత్తం చెన్నైది ఇదే తీరు. బౌలర్లు మాత్రం నిలకడగా రాణిస్తున్నారు. ఇమ్రాన్‌ తాహిర్‌, హర్భజన్‌, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూనే ఉన్నారు.

ఐపీఎల్‌ ఫైనల్‌ అభిమానులకు క్రికెట్‌ విందు అందించనుంది. ఈ సీజన్‌లో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌తో రాజస్థాన్‌ మ్యాచ్‌లో 399 పరుగులు.. హైదరాబాద్‌తో పంజాబ్‌ మ్యాచ్‌లో 379 పరుగులు వచ్చాయి. హైదరాబాద్‌ మూడు సార్లు 200 పైచిలుకు స్కోర్లు చేసింది. ఫైనల్‌కూ బ్యాటింగ్‌ ఇచ్చే అవకాశముంది.

Related posts