నేడు పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. దేశంలో మూడు ప్రముఖ విమానాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ మీడియాకు తెలిపారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద అహ్మదాబాద్, లఖ్‌నవూ, మంగళూరు విమనాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
అలాగే ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2019-20 పంట సీజన్‌కు సంబంధించి వరి మద్దతు ధరను 3.7శాతం పెంచింది. దీంతో క్వింటాల్ వరి ధర రూ.1,815కు చేరింది. ఇక జొన్నలు, రాగులు, పప్పు ధాన్యాల ధరలను కూడా పెంచేందుకు ఆమోదించింది. వీటితో పాటు మూడు కీలక బిల్లును కూడా కేబినెట్ ఆమోదించినట్లు జావడేకర్ తెలిపారు. అయితే వాటి వివరాలు ఇప్పుడే చెప్పలేనని, పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడిస్తామని అన్నారు. వేజ్ కోడ్‌పై బిల్లుకు ఆమోద ముద్ర వేసినట్లు మాత్రం చెప్పారు.