తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. తన కుమారుడు సుధీర్ తో కలిసి వైసీపీలో చేరారు. వీరిద్దరినీ పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో శిద్దా మాట్లాడుతూ ఏడాది కాలంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నో పథకాలు అమలు చేస్తారని అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.