telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉక్రెయిన్ నుంచి స్వ‌దేశానికి చేరుకున్నతెలుగురాష్ర్టాల విద్యార్థులు

ఉక్రెయిన్ రష్యా దాడి నేపథ్యంలో అక్క‌డ‌ చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలలో మొత్తం 469 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు.

రొమెనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 219 భారతీయులతో కూడిని ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. స్వేదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు.

ముంబై చేరుకున్న విమానంలో పలువురు ఏపీకి చెందిన 10 మంది, తెలంగాణకు చెందిన 15 మంది ఉన్నారు. వీరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వారి యోగక్షేమాలను అధికారులు తెలుసుకున్నారు.

ముంబై చేరకున్న తెలుగు విద్యార్థుల్లో.. 20 మంది ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌కు చేరుకున్న విద్యార్థులు మాట్లాడుతూ.. యుద్ధం జరుగుతుండటంతో భయపడ్డామని… భారత ఎంబసీ వారి సహకారంతో క్షేమంగా చేరుకున్నామని వెల్లడించారు.

యువతులు క్షేమంగా రావటంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. బుకారెస్ట్‌ నుంచి మరో 17 మంది దిల్లీకి చేరుకున్నారు. సాయంత్రానికి మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది.

నిన్న రాత్రి 11 గంటలకు ముంబయి చేరుకున్నాం. భారత ఎంబసీ వారి సాయంతో క్షేమంగా చేరుకోగలిగాం. ఇంకా కొంతమంది ఉక్రెయిన్‌ బంకర్లలో ఉన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దు వరకు బస్సుల్లో చేరుకున్నాం. మమ్మల్ని తీసుకురావడంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా సాయం చేశాయి. క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంద‌ని విద్యార్ధులు తెలిపారు.

Related posts