telugu navyamedia
రాజకీయ

దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారు: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధింపు

*శ్రీలంకలో భగ్గుమన్న నిరసనలు.. మరోసారి ఎమర్జెన్సీ విధింపు
*దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారు
*కోలోంబోలో రోడ్ల‌పై వ‌చ్చిన జ‌నాలు
*గాల్లోకి కాల్పులు జ‌రిపిన పోలీసులు

*ఆందోళకారులపై భాష్ప వాయువును ప్రయోగం

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో… శ్రీలంకలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి రణిల్ విక్రమ్‌సింఘే ప్రకటించారు.

ఇది తెలిసిన జనం ఉదయం నుంచే మళ్లీ రోడ్డెక్కారు. కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది ర్యాలీగా ఆందోళనకారులు తరలివస్తుండడంతో వారిని నిలువరించేందుకు ఆర్మీ, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

ఆందోళకారులపై భాష్ప వాయువును ప్రయోగించారు.  దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితులు అదుపుతప్పుతుండడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని ఎమర్జెన్సీ మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించింది.

కాగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్​తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.

దీంతో  ప్రధాని నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు దేశం విడిచి పారిపోయిన గొటబాయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఆయన రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు.

అయితే నిరసనకారులు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇద్దరూ తమ పదవుల నుంచి తక్షణమే తప్పుకోవాలని తేల్చి చెప్పారు.

ప్రజల ఆందోళన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 13న రాజీనామా చేస్తానని చెప్పిన రాజపక్స.. అదే రోజు దేశం విడిచి పారిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని విక్రమ సింఘే ఇదివరకే ప్రకటించారు. కానీ పరిస్థితులు దిగజారినందున లంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధించారు.

Related posts