telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజధానిపై జగన్ స్పష్టత.. నిర్మాణాలు కొనసాగింపు.. వికేంద్రీకరణ తప్పనిసరి..

రాజధాని అమరావతి పై జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సాగుతున్న వివాదానికి ముగింపు పలికారు. తొలిసారిగా రాజధాని విషయంలో అధికారులు స్పష్టమైన మార్గ నిర్దేశం చేశారు. అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన (ఎల్‌పీఎస్‌) లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహనిర్మాణాల వంటి… ఇప్పటికే చేపట్టిన పనులన్నింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. రాజధాని విషయంలో గత ప్రభుత్వం వలే ఆర్బాటపు ప్రకటనలు వద్దని.. వాస్తవానికి దగ్గరగా.. పనుల పరిమాణం..ఖర్చు తగ్గించాలని సీఎం ఆదేశించారు. దానికి అవసరమైన నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణ పనులు డిసెంబరులోను, హ్యాపీనెస్ట్‌ పనులు జనవరి 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి పక్కనే ఏడంతస్తులుగా నిర్మిస్తున్న సీఆర్‌డీఏ కార్యా99లయ భవనం పనులూ త్వరలో ప్రారంభించనున్నారు.

రాజధానిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైనంత మేరకే రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎనిమిది, ఆరు వరుసలుగా నిర్మించాలనుకున్న రహదారుల వెడల్పు తగ్గించాలని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు విస్తరించుకునేందుకు వీలుగా అటూ ఇటూ ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. మొత్తం రాజధాని ప్రాంతాన్ని 13 జోన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారని, వాటిలో భాగంగానే ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో మౌలిక వసతులూ అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, దీనికి రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి, సగం పూర్తయిన భవనాల్ని పూర్తి చేసేందుకు, ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున, వచ్చే మూడేళ్లలో ఈ మొత్తం నిధులు సమకూర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులు గ్రాంటుగా ఇవ్వాలని, బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని ప్రతిపాదించారు. నిపుణులతో సంప్రదించి తగిన ప్రతిపాదనలతో రావాలని సీఎం సూచించారు. పాలనా పరంగా కీలకమైన సచివాలయం.. శాసనసభ..హైకోర్టు విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని పైన ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజధానితో అధికార వికేంద్రీకరణ దిశగా నివేదిక సిద్దం చేస్తున్న సీఎన్ రావు కమిటీ సిఫార్సులకు ఆధారంగా నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతి కొనసాగిస్తూనే..జిల్లాల వారీగా అధికార వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Related posts