telugu navyamedia
సినిమా వార్తలు

ఈ రోజు రామోజీరావు పుట్టిన రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్‌..

కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్‌16 న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు.
* 1947లో గుడివాడ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి 1951 వరకు సిక్త్స్‌ ఫాం వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని ఓ యాడ్‌ ఏజన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు.

Can You Recognize Ramoji Rao?
* 19.08.1961లో తాతినేని రమాదేవితో వివాహం.
* 1962లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
* 1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్‌ స్థాపన.
* 1965లో కిరణ్‌ యాడ్స్‌ ప్రారంభం.
* 1967-1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్‌ పేరుతో ఎరువుల వ్యాపారం.
* 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు.
* 1970లో ఇమేజస్‌ అవుట్‌డోర్‌ అడ్వర్టయిజింగ్‌ ఏజన్సీ ప్రారంభం.
* 1972-1973 విశాఖలో డాల్ఫిన్‌ హోటల్‌ నిర్మాణానికి శ్రీకారం.
* 21.06.1980లో త్రీస్టార్‌ హోటల్‌గా డాల్ఫిన్‌ ప్రారంభం.
* 10.08.1974లో విశాఖ ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభం.
* 12.08.1974లో మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభం.
* 1975 డిసెంబరు 17న ‘ఈనాడు’ హైదరాబాదు ఎడిషన్‌ ప్రారంభమైంది.
* 03.10.1976లో సినీ ప్రేమికుల కోసం ‘సితార’ పత్రికను ప్రారంభించారు.
* ఫిబ్రవరి 1978లో ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికల ప్రారంభం.
* 09.02.1980లో ‘ప్రియా ఫుడ్స్‌’ ప్రారంభం.
* 02.03.1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థ ఏర్పాటు.
* 1990లో ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ప్రారంభం.
* 1992-1993లో సారాపై సమరం. మధ్యంపై నిషేద ఉత్తర్వులు వచ్చేదాకా పోరు.
* 1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ స్థాపన
* 27.01.2002లో ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్ల ప్రారంభం.
* 20.06.2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ ప్రారంభం.
* 14.04.2008లో సమాచార చట్టం కోసం ‘ముందడుగు’
* 25.12.2014లో ప్రధాని మోదీ ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్‌ చేశారు.
* 14.11.2015లో మరో నాలుగు ఈటీవీ ఛానళ్ల ఆరంభం.


➖➖➖➖➖

నిత్య కృషీవలుడికి.. నిరుపమాన గౌరవం!

పాత్రికేయ రంగానికి సేవలకుగాను రామోజీరావుకు ‘పద్మవిభూషణ్‌’

నిరంతర శ్రమ… నిత్యం కొత్తదనం కోసం తపన..పుట్టిన నేలకు.. చుట్టూ ఉన్న సమాజానికి గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆధునిక రుషి ఆయన..! ఆయనే.. రామోజీరావు!

పగలూ రాత్రి శ్రమించిన ఆయన స్వేదంలోంచి జనించిందే ‘రామోజీ గ్రూప్‌’! ప్రత్యక్షంగా.. 25వేల మందికి.. పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మహాసంస్థ..!

File:The President, Shri Pranab Mukherjee presenting the Padma Vibhushan Award to Shri Ramoji Rao, at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on April 12, 2016.jpg - Wikimedia Commons

‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అంటూ..
తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ‘ఈనాడు’ నుంచి..
క్షణక్షణం ఆనంద వీక్షణంగా సాగే..
వినోదాల ప్రభంజనం ‘ఈటీవీ’ వరకూ..
జాతికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచే ‘అన్నదాత’ నుంచి..
ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘రామోజీ ఫిలిం సిటీ’ వరకూ..
అన్నీ.. ఆయన ఒడిలో.. బడిలో పుట్టిన బిడ్డలే!
రామోజీరావు ఏం చేసినా విలక్షణంగా చేస్తారు. విలువలతో చేస్తారు.. అని తెలుగు ప్రజ మాత్రమే కాదు.. యావద్భారతం మనసారా నమ్ముతుంది. ఆయన అడుగులో అడుగు కలుపుతుంది.

జీవన గమనాన్నే.. ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు 1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లాలోని ఒక పల్లెటూరులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు.

KCR, Chandrababu Naidu extend wishes to Ramoji Rao

1962 ఆయన ప్రారంభించిన మొట్టమొదటి వ్యాపార సంస్థ ‘మార్గదర్శి’ చిట్‌ఫండ్స్‌. చిన్న బిందువుగా మొదలైన ఆ శాఖ.. అలా అలా మహావృక్షంగా విస్తరించింది. ప్రస్తుతం 105 శాఖలతో, 4,300 మంది సిబ్బందితో.. 800 మందికిపైగా ఏజెంట్లతో.. లక్షల సభ్యులతో, రూ. 7,750 కోట్ల టర్నోవర్‌తో తిరుగులేని సంస్థగా ఎదిగింది.

తాను పుట్టి పెరిగిన పల్లెటూరికి.. అక్కడి రైతన్నల రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతో 1969లో ‘అన్నదాత’ మాసపత్రికని ప్రారంభించారు. నాగేటి చాళ్లల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొలకెత్తాలన్న ఆశతో.. ఆకాంక్షతో అన్నదాత పత్రికను తీర్చిదిద్దారాయన. ఈ రోజు ఈ పత్రిక చందాదారులు 3 లక్షల మంది!

8 Movies That Belong To Ramoji Rao Alone - Wirally

ఆగస్టు 10 1974న విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ‘ఈనాడు’ తెలుగునాట ఒక సమాచార సంచలనాన్నే సృష్టించింది! అణువణువునా కొత్తదనాన్ని విరజిమ్ముతూ.. ప్రజల పక్షాన అక్షర యుద్ధాన్ని ప్రకటించిన ‘ఈనాడు’ దినపత్రిక ప్రారంభించిన నాలుగేళ్లల్లోనే అత్యధిక పాఠకుల అభి‘మానస’ పుత్రికగా మారింది! ప్రాంతీయ దినపత్రికల చర్రితలో.. ‘ఈనాడు’ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. పరిశోధనా పాత్రికేయం ప్రారంభమైంది ఈనాడుతోనే! ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు కాగడాలెత్తింది.. ఈనాడు. రామోజీరావు ఆలోచనలకు ప్రతిరూపంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక పుటను అక్షరాల బాట పట్టించిన ఘనత.. చరిత.. ‘ఈనాడు’దే! చాలా చిన్న స్థాయిలో మొదలైన ఈ పత్రిక.. ఈనాడు పత్రికా రంగానికే తలమానికంగా భాసిల్లుతోంది. 1987లో ‘ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’కు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికాస్వేచ్ఛను పరిరక్షించేందుకు సమరశంఖం పూరించి.. కలం బలం ఏపాటిదో లోకానికి చూపించారాయన!

వెండితెరపైనా రామోజీరావు తన ముద్ర వేశారు. సినిమాలంటే.. కదిలే బొమ్మలు మాత్రమే కాదని.. మనసును కదిలించే శక్తివున్న దృశ్య మాధ్యమాలని నిరూపించారు. ‘ఉషా కిరణ్‌ మూవీస్‌’ సంస్థను స్థాపించి.. వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఒక ప్రతిఘటన.. మరో మయూరి.. ఇంకో మౌన పోరాటం.. ఇలా ఏది చూసినా.. ప్రతి ఒక్కటీ ఒక ప్రయోగం.. పెను సంచలనం! ఇలా తమ చిత్రాలూ చైతన్య దీపాలని.. ప్రగతి రథ చక్రాలనీ చాటారు! ఆయన చిత్రాల్లోనూ ఎప్పుడూ కొత్తవారికి.. కొత్తదనానికే పెద్దపీట! ఉషాకిరణ్‌ మూవీస్‌లో పుట్టిన ఎందరో నటీనటులు.. సాంకేతిక నిపుణులు.. దర్శకులు తమదైన ప్రతిభ ప్రదర్శిస్తూ.. అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు.

సినిమా పరిశ్రమకే కాదు.. పర్యాటక రంగానికీ రామోజీరావు అందించిన మరో మహాద్భుతం.. ‘రామోజీ ఫిలిం సిటీ’! సినీ నిర్మాణానికి కావల్సిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూలతోటలు.. కళ్లు చెదిరే స్టూడియోలతో.. అన్ని వయసులవారినీ మంత్రముగ్ధుల్ని చేసే రామోజీ ఫిలిం సిటీ ‘గిన్నిస్‌ బుక్‌’లో తన పేరు నమోదు చేసుకుందంటే.. ముందుగా తలుచుకోవాల్సిన పేరు.. రామోజీరావుదే!

Ramoji Rao plans to start his own OTT platform? | Telugu Rajyam

1995లో ఆయన స్థాపించిన ‘ఈటీవీ’ అనతికాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది. ఈటీవీ నెట్‌వర్క్‌గా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. తెలుగు లోగిళ్లకు శరవేగంగా వార్తల్ని చేరేవేసేందుకు ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌.. ఈటీవీ తెలంగాణ’ ఛానళ్లను ప్రారంభించి.. విశ్వసనీయ సమాచారానికి వేదికలుగా తీర్చిదిద్దారు రామోజీరావు. తాజాగా ‘ఈటీవీ ప్లస్‌.. ఈటీవీ అభిరుచి.. ఈటీవీ సినిమా.. ఈటీవీ లైఫ్‌’ ఛానళ్లకు రూపకల్పన చేసిందీ రామోజీరావే! ఈరోజు ‘ఈటీవీ’ తెలుగు టెలివిజన్‌ రంగంలోనే అగ్రస్థానంలో నిలిచిందంటే అందుకు కారకులు.. ప్రేరకులు.. ఆయనే!

రామోజీరావు మదిలో మొగ్గతొడిగిన ఎన్నో సంస్థలు నేడు ప్రగతి దారిలో దూసుకుపోతున్నాయి. 1980లో ప్రారంభించిన ‘ప్రియా ఫుడ్స్‌’ ఇప్పుడు 22 దేశాల్లో ప్రజలకు ప్రియమైన రుచులు అందిస్తోంది. ఆతిథ్యరంగంలో అద్వితీయ స్థానం పొందిన ‘డాల్ఫిన్‌ హోటల్స్‌’.. చిత్రరంగ విశేషాల సుమమాలిక ‘సితార’ సాహితీరంగంలో విశేష సేవలందిస్తున్న ‘విపుల.. చతుర’ ఇవన్నీ రామోజీరావు కృషి ఫలితాలే.

రామోజీరావుకు మాతృభాషంటే ఎక్కడలేని మమకారం.. అమ్మభాష అంతరించకుండా అరచేతులు అడ్డుపెట్టి తల్లిపాల రుణం తీర్చుకునేందుకు ‘తెలుగు వెలుగు’ పత్రికను జాతికి అందించారాయన! అలాగే పిల్లల మనసుల్లో వినోద.. విజ్ఞాన కాంతులు చిమ్మేందుకు ‘బాలభారతం’ పత్రికను ఆరంభించారాయన. బాలలు మన సంస్కృతీ మూలాలను మరచిపోరాదన్నది ఆయన ప్రగాఢ భావన.

ఆయన కృషి.. అసాధారణం- ఆయన దీక్షాదక్షతలు.. అద్వితీయం..!
కాబట్టే ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఆయనకు ప్రత్యేకంగా పురస్కారాలు అందించాయి.

1986లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు (ఆంధ్ర విశ్వవిద్యాలయం) ‘డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌’ డిగ్రీని.. 1989లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘గౌరవ డాక్టరేట్‌’ణు ప్రదానం చేశాయి. ఇటీవలే శ్రీశ్రీ విశ్వవిద్యాలయం సైతం ఆయనకు ‘డాక్టరేట్‌’ ఇచ్చి సత్కరించింది.

ఇలా.. ఎన్ని విజయాలు వచ్చినా.. ఎన్ని సత్కారాలు వరించినా.. సాధించిన దానితో రామోజీరావు ఎప్పుడూ పొంగిపోలేదు. సంతృప్తి పడలేదు. ఇంకా.. ఇంకా ఏదో చేయాలన్న తపన.. అదే ఒక తపస్సుగా.. నిరంతరం పనిలోనే విశ్రాంతిని ఎంచుకునే రామోజీరావుకు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘పద్మవిభూషణ్‌’ పురస్కారాన్ని ప్రకటించడం.. ఆ సాటిలేని కృషీవలుడికి సముచితమైన గుర్తింపు.. గౌరవం!

💐💐💐
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు…
💐💐💐

Related posts