telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

rain hyderabad

భారీ వర్షాలతో ఏపీ‌, తెలంగాణ అతలాకుతలం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే.. వారం రోజులుగా వరద, బురదతో అవస్ధలు పడుతున్నారు జనం. శనివారం నాటి వర్షంతో నగరవాసులకు ఇబ్బందులు మరింత పెరిగాయి. రానున్న వర్ష సూచనపై భయాందోళనలు పెరుగుతున్నాయి. తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల వచ్చే రెండు రోజులు భారీ వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.  

అటు… ఆంధ్రప్రదేశ్‌కు మరో వాయుగుండం పొంచి ఉంది. ఇప్పటికే గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్బరిస్తోంది. ఇప్పటికే.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరులో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ తరుణంలో వాతావరణశాఖ హెచ్చరిక ప్రజలను కలవరపెడుతోంది. 

Related posts